పెట్రోల్ బంకుల్లో వెలుగుచూసిన ఘరానా మోసం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. పెట్రోల్ బంకు నిర్వాహాకులు దగా చేస్తున్న తీరు వాహనదారులనే కాదు పోలీసులనూ విస్మయానికి గురి చేసింది. పెట్రోల్ బంకుల్లో ఇంటిగ్రేటెడ్ చిప్‌లను అమర్చి, వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్న వైనాన్ని తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా కూపీ లాగుతున్నారు.
చిప్‌లను ఎక్కడ తయారు చేస్తున్నారు? ఇంకెన్ని పెట్రోల్ బంకులకు విక్రయించారు?
ఈ చిప్‌లను ఇంకెన్ని పెట్రోల్ బంకులకు విక్రయించారు? వాటిని ఎక్కడ తయారు చేస్తున్నారో తెలుసుకునేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ చిప్‌లను సరఫరా చేసిన ముంబైకి చెందిన జోసెఫ్, షిబు థామస్ కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. వీరి నుంచి చిప్స్‌ను తీసుకుని తెలంగాణలో 11, ఆంధ్రప్రదేశ్‌లోని 19 పెట్రోల్ బంక్‌లలో అమర్చిన షేక్ సుభానీ భాషా ముఠాను శనివారం(సెప్టెంబర్ 5,2020) సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఒక్కో చిప్ రూ.20వేలకు కొని రూ.1.20లక్షలకు విక్రయం:
జోసెఫ్ నుంచి ఒక్కొక్క చిప్‌ను రూ.20 వేలకు కొనుగోలు చేసిన సుభానీ ముఠా.. వీటిని పెట్రోల్ బంక్ యజమానులకు రూ.1.20 లక్షలకు విక్రయించినట్టు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ చిప్స్ తయారీ పరిశ్రమను గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. జోసెఫ్ స్వయంగా ఈ చిప్స్ తయారీ పరిశ్రమను నడిపిస్తున్నాడా? ఇతరుల నుంచి కొనుగోలు చేస్తున్నాడా? అనేది తేలాల్సి ఉంది. ఈ చిప్స్ తయారీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను వీరు కూడా రూపొందించి వాటికి లీటర్ పెట్రోల్‌కు 30 మిల్లీ లీటర్లు కొల్లగొట్టేలా ప్రోగ్రామ్‌ను ఫిక్స్‌చేసి వాహనదారులను మోసం చేస్తున్నారు.
https://10tv.in/illegal-liquor-seized-from-water-tanker-by-police/
పెట్రోల్ బంకుల లైసెన్స్ శాశ్వతంగా రద్దు:
కేసు దర్యాప్తులో భాగంగా సైబరాబాద్ పోలీసులు.. సీజ్ చేసిన 11 పెట్రోల్ బంక్‌ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటడ్ (ఐవోసీఎల్)కు లేఖలు రాశారు. చిప్ వల్ల వాహనదారులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. దీనిపై ఐవోసీఎల్ కూడా విచారణ జరపనున్నది. పోలీసులు సేకరించిన ఆధారాలను పరిశీలించి వీరి లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉంది.
చిప్స్ తో చీటింగ్, డిజిటల్ మీటర్లలోనూ మోసాలు:
సాధారణ రీడింగ్ వల్ల తక్కువ పెట్రోల్ పోస్తున్నారని గుర్తించిన ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు ఖచ్చితమైన ఘన పరిమాణాన్ని అందించాలనే లక్ష్యంతో డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేశారు. వీటిని సైతం కంట్రోల్ చేసేలా మరో చిప్ ను ఏర్పాటు చేసుకున్నారు పలు బంకుల యాజమానులు. తెలంగాణాలో దీనికి సంబంధించిన తీగ లాడితే ఏపీలో చిత్తూరు, పశ్చిమ గోదావరిలో పలు బంకులు ఇదే విధమైన దోపిడీకి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని పెట్రోల్ బంకుల్లో గుట్టుగా జరుగుతున్న దోపిడీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. బంకుల్లో పెట్రోల్ పరిమాణాన్ని సూచించే డిజిటల్ మీటర్‌కు ఓ చిన్నపాటి చిప్‌ను అమర్చడం ద్వారా వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నట్లు వెల్లడైంది.
ప్రతి లీటరుకు 30 ఎంఎల్ పెట్రోలు తక్కువగా వస్తుంది:
తెలంగాణలోని పలుచోట్ల పెట్రోలు బంకుల్లో ఆయిల్ తక్కువగా వస్తున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపిన అధికారులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన బాషా.. ఎలక్ట్రానిక్ చిప్‌లను తయారు చేసి బంకు నిర్వాహకులకు అమ్మినట్లు గుర్తించారు. సిమ్‌కార్డును పోలి ఉండే ఈ చిప్‌ను బంకుల్లో పెట్రోలు రీడింగ్ తెలియచేసే డిజిటల్ అనలాగ్ దగ్గర అమరుస్తారు. దీంతో ప్రతి లీటరుకు 30 ఎంఎల్ పెట్రోలు తక్కువగా వినియోగదారులకు అందుతుంది.
రూ.లక్షకు చిప్ కొని రూ.5లక్షలు సంపాదించాడు:
భాషా ఇచ్చిన సమాచారంతో చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ సమీపంలోని ఓ పెట్రోలు బంకును తనిఖీ చేసిన పోలీసులు, తూనికల శాఖ అధికారులు ఎలక్ట్రానిక్ చిప్ ఉండటాన్ని గుర్తించి బంకు మేనేజరు వెంకట్రావు(39)ను అదుపులోకి తీసుకున్నారు. పెట్రోలు బంకు నిర్వాహకుడు గుంటూరు జిల్లా గురజాలకు చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. ఇతను 2020 ఫిబ్రవరిలో భాషా నుంచి రూ.లక్షకు ఎలక్ట్రానిక్ చిప్‌ను కొనుగోలు చేశాడు. ఇప్పటివరకు 6వేల 457 లీటర్ల పెట్రోలును విక్రయించాడు. ప్రతి లీటరుకు 40 ఎంఎల్ తక్కువగా పోయడం ద్వారా రూ.5.51 లక్షలు వినియోగదారుల నుంచి కాజేసినట్లు విచారణలో వెల్లడైంది.
‘పశ్చిమ’లో 11 బంకులు సీజ్:
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలక్ట్రానిక్ చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్న 11 పెట్రోల్ బంకులను అధికారులు సీజ్ చేశారు. ఏలూరు మాదేపల్లి రోడ్డు ప్రేమాలయం సమీపంలోని ఐవోసీ బంకు, సత్రంపాడులోని బీపీసీఎల్, భీమడోలులోని ఎస్‌ఆర్ బంకు, ఐవోసీ పెట్రోల్ బంకు, విజయరాయిలోని బీపీసీఎల్, భీమవరంలోని ఐవోసీ, నరసాపురంలోని ఎస్‌ఆర్ పెట్రోల్ బంకు, పెరవలిలో ఐవోసీ, కాపవరంలోని హెచ్‌పీ, నల్లజర్లలోని ఐవోసీ, పాలకొల్లులోని పెట్రోల్ బంకులను సీజ్ చేశారు. పెట్రోల్ బంకుల నిర్వాహకులు రూ.లక్ష నుంచి రూ.1.70 లక్షల వరకు చెల్లించి ఈ చిప్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సాఫ్ట్ వేర్ డిజైన్ చేసి వారి తెలివికి పోలీసులు విస్మయం:
‘షేక్ సుభానీ భాషా, బాజి బాబా, మాదాసు గిరి శంకర్, ఇప్పిలి మల్లేశ్వర్ రావులు ముఠాగా ఏర్పడ్డారు. ఒక సాఫ్ట్‌వేర్, ఒక ప్రోగ్రాం డిజైన్ చేశారంటే చాలా తెలివిగా ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక తమిళనాడులోనూ వీళ్ళు చిప్ లు పెట్టి ఉండొచ్చు, బంకు ఓనర్లకు ఇదంతా తెలిసే జరుగుతుంది, తెలంగాణలో 4 బీపీసీఎల్, 2 హెచ్ పీసీఎల్, 5 ఐఓసీఎల్ బంకుల్లో చిప్పులు అమర్చారు’ ప్రస్తుతం వాటిని సీజ్ చేశాం. ఆయిల్ కార్పొరేషన్ సర్ప్రయిజ్ విజిట్ చేయటం ద్వారా ఈ మోసాన్ని కనిపెట్టలేరు. ఇక నుంచి ఆయిల్ కార్పొరేషన్ కూడా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని’ సీపీ సజ్జనార్ అన్నారు.