సోషల్ మీడియాలో వేధింపులు అధికమౌతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..వ్యక్తిగత సమాచారం ఎలా వెళుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు మహిళలు. వారు చేసే చర్యలకు తలదించుకుంటున్నారు. తమ పరువు ఎక్కడ పోతుందోమోనని బయటకు రావడం లేదు. తరచూ ఫోన్లు చేయడం..బెదిరించడం..మార్ఫింగ్ ఫొటోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
తమ సమస్యలు పరిష్కరించాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇదే విధంగా చోటు చేసుకుంది. మారేడ్ పల్లికి చెందిన ఓ యువతికి తరచూ ఫోన్లు వస్తున్నాయి. ఇవన్నీ ఆమెకు తెలియని వారే. తనకు తెలియకుండా ఫోన్ నెంబర్ ఎలా వెళ్లింది అని ఆలోచించసాగింది. కానీ ఎలాంటి విషయం తెలియలేదు. పదుల సంఖ్యలో ఫోన్లు రావడంతో మానసికంగా కృంగిపోయింది.
ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే.. మీ నెంబర్ ఫేస్ బుక్ లో ఉందని సమాధానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకుంది. ధైర్యం చేసుకుని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.