గురువంటే దైవంతో సమానం అని చెబుతారు. పిల్లలకు విద్య నేర్పి మంచి మార్గంలో వెళ్లేలా చూడాల్సిన బాధ్యత గురువుదే. టీచర్ అంటే ఎంతో గౌరవం ఇస్తారు. అలాంటి వృత్తికి కళంకం తెచ్చాడో గురువు. చేయకూడని పని చేసి అరెస్ట్ అయ్యాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన నారాయణ జూనియర్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ ముఖేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మదీనాగూడలో ఈ ఘటన జరిగింది.
భువనగిరికి చెందిన ముఖేష్ మదీనాగూడ నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. రోజురోజుకి వేధింపులు ఎక్కువ కావడంతో విసుగు చెందిన బాలికలు శుక్రవారం ధర్నాకు దిగారు. స్టడీ అవర్‌లో విద్యార్థినులను ఒక్కొక్కరిగా పిలిచి వేధించేవాడని వాపోయారు. విద్యార్థినుల తల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 8న అతడిపై కేసు నమోదైంది.
అప్పటి నుంచి ముఖేష్ పరారీలో ఉన్నాడు. అతడిపై పోలీసులు పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేసి.. గాలింపు చేపట్టారు. మంగళవారం(నవంబర్ 12,2019) ముకేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ముఖేష్ మదీనాగూడలోని నారాయణ కాలేజీ బ్రాంచ్‌లో రెండేళ్లుగా వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.