బీ కేర్ ఫుల్ రైడర్స్ : హైదరాబాద్ లో సౌండ్ లెవల్ మీటర్లు

  • Publish Date - March 11, 2019 / 06:00 AM IST

హైదరాబాద్ : ఓవర్ స్పీడ్ తో పాటు సైలెన్సర్లు తీసేసి.. సౌండ్ ఎక్కువ చేస్తున్న టూవీలర్స్ పై దృష్టి పెట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అకతాయిలు బండి సైలెన్సర్ మారుస్తూ.. శబ్ద కాలుష్యాన్ని పెంచుతున్నారు. విపరీతమైన సౌండ్ తో మిగతా వాహనదారులకూ చుక్కలు చూపిస్తున్నారు. వాస్తవంగా అయితే.. ట్రాఫిక్‌ 175సీసీ లోపు బైక్‌లకు 74 డెసిబుల్స్‌ సౌండ్‌ వరకు అనుమతి ఉంది. 175 సీసీ కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న బైక్‌లకు 80 డెసిబుల్స్‌ సౌండ్‌ వరకు అనుమతి ఉంది. కొన్ని బైకులు 90, 100 డెసిబెల్స్‌ కంటే ఎక్కువ శబ్దాన్ని ఇచ్చేలా  సైలెన్సర్ లలో మార్పులు చేస్తున్నారు.

ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఇలాంటి వాటి  భరతం పట్టనున్నారు. ఇలాంటి వాహనాలను గుర్తించి భారీ జరిమానాలు విధించాలని నిర్ణయించారు. వీటితోపాటు బోరుకొచ్చిన వెహికల్స్, కాలం చెల్లిన వాహనాలనూ కట్టడి చేస్తున్నారు. పొల్యూషన్ తగ్గించటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. హారన్ విషయంలోనూ కంట్రోల్ పెడుతున్నారు. జరిమానాలు విధించినా, చట్టంలో లొసుగుల వల్ల తప్పించుకు పోయేవారు.  ఇప్పుడు అలాంటి వాటికి చెక్ పెడుతూ నగర పోలీసులు ఆధునిక పరికరాన్ని సమకూర్చుకున్నారు. 

“సిర్రస్” అనే సంస్ధ రూపొందించిన సౌండ్ లెవల్ మీటర్ నగర పోలీసులకు అందుబాటులోకి వచ్చింది. సైఫాబాద్, SR నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఉపయోగిస్తున్నారు. పరిమితికి మించి శబ్దం చేసే వాహనాలను గుర్తించి వాటికి రూ.1000 వరకు జరిమానా విధిస్తున్నారు. సిర్రస్‌ కంపెనీ తయారు చేసిన వీటిని నగర పోలీసులకు ప్రాక్సిస్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ అందజేస్తోంది. ఈ మీటర్‌కు శబ్దాన్ని డిసిబుల్స్‌లో గుర్తించే బాల్‌ను అమరుస్తారు. ఇది వాహనాన్ని రెండు నుంచి మూడు మీటర్ల దూరం నుంచే స్కాన్‌ చేసి శబ్దాన్ని రికార్డు చేస్తుంది. నిబంధనల కంటే శబ్దం ఎక్కువగా ఉంటే ఆ మీటర్‌ను ట్రాఫిక్‌ పోలీసుల దగ్గర ఉండే హ్యాండ్‌ హెల్డ్‌ మీటర్‌కు జతచేస్తే.. కేబుల్‌ సాయంతో వెంటనే జరిమానా రశీదు వచ్చేలా చేస్తుంది. అందులో వెహికల్ నెంబర్, ఓనర్ పేరు, ఫోన్ నెంబరు అందుబాటులో ఉన్న ప్రాధమిక సాక్ష్యాధారాలతో సహా బిల్లులో వస్తుంది. దీని ధర రూ.2లక్షల 75 లక్షలు. ఈ కిట్ లో  క్యాలిబ్రేటర్, కేబుల్ ప్రింటర్, పెన్ డ్రైవ్, చార్జర్ ఉన్నాయి.

ఇందులోని వాయిస్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీ ద్వారా వాయిస్‌ గుర్తించి ఈ కిట్ పనిచేస్తుంది. SR నగర్‌కు చెందిన ఇద్దరు ఎస్సైలు, సైఫాబాద్‌కు చెందిన ఒక ఎస్సైకి  వీటి వినియోగంపై శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో వినియోగించటం ఇదే. ఇక్కడి ఫలితాలను బట్టి ప్రభుత్వం ఇతర పోలీసు స్టేషన్లకు విస్తరించనుంది.