Sperm Business: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాలు వెలుగులోకి రావడంతో హైదరాబాద్ నగరంలోని స్పెర్మ్ క్లినిక్ లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నగర వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ లోని ఇండియన్ స్పెర్మ్ క్లినిక్ లో తనిఖీలు నిర్వహించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. 16 స్పెర్మ్ శాంపిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇండియన్ స్పెర్మ్ క్లినిక్ లో ఎలాంటి అనుమతులు లేకుండా దాతల నుంచి స్పెర్మ్ సేకరిస్తున్నట్లు గుర్తించారు. అలా సేకరించిన శాంపిల్స్ ని అహ్మదాబాద్ లోని ఓ ఫెర్టిలిటీ సెంటర్ కు పంపుతున్నట్లు నిర్ధారించారు. డొనేట్ చేసే వారికి 4వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు గుర్తించారు.
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసుకి సంబంధించి అనేక కోణాల్లో దర్యాఫ్తు చేస్తుండగా.. హైదరాబాద్ లో స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్న పలు క్లినిక్ లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. ఒక్కో వ్యక్తికి 4వేలు ఇచ్చి స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. అలా సేకరించిన వీర్య కణాలను అహ్మదాబాద్ లోని ఫెర్టిలిటీ సెంటర్ కు పంపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
”గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ లో చీకటి బాగోతం బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ వీర్య కణాలను సేకరిస్తున్నారు. 21 సంవత్సరాల వయసు నుంచి 39 సంవత్సరాల వయసు వారు సెమెన్ డొనేషన్ కు అర్హులు అని ఆ క్లినిక్ బయట పోస్టర్ పెట్టారు. ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తోంది.
ఈ కేసులో ఇప్పటివరకు ఏడు మందిని అరెస్ట్ చేశాం. రెజిమెంటల్ బజార్ లోని ఇండియన్ స్పర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోనీని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చాము. ఇండియన్ స్పెర్మ్ టెక్ లో అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని అండాలను సేకరిస్తున్నారు.
గత కొంతకాలంగా ఇండియన్ స్పెర్మ్ టెక్ నుండి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించాము. అనధికారికంగా ఈ కేంద్రాన్ని నడుపుతున్నారు. పంకజ్, సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను అరెస్ట్ చేశాము. వీర్య కణాలను, అండాలను గుజరాత్, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్ లోని ఐవీఎఫ్ కేంద్రాలకు తరలిస్తున్నారు” అని పోలీసులు వెల్లడించారు.