pregnant woman
Pregnant Woman Suicide Attempt : ఏడునెలల గర్భవతిగా ఉన్న వివాహిత, భర్తకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆదృశ్యమయ్యింది. ఆమె ఆచూకి కనపడక పోవటంతో కుటుంబం ఆందోళన చెందుతోంది.
చిత్తూరు జిల్లా మదనపల్లె,నీరుగుట్టపల్లెకు చెందిన పుష్పావతి (21) గాలివీడు మండలం అరవీడుకు చెందిన పుర్రం మారుతీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ ఒకరి నొకరు సన్నిహితంగా ఉండసాగారు. ఈ క్రమంలో పుష్పావతి గర్భం దాల్చింది. ప్రేమికులిద్దరూ ఈ విషయాన్ని తమ ఇళ్ళల్లో చెప్పారు. ఇరు కుటుంబాల అంగీకారంతో రెండు నెలల క్రితం రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
పెళ్లి తర్వాత అత్తవారింటికి వచ్చిన పుష్పకు సెప్టెంబర్ నెలలో సాంప్రదాయబధ్దంగా ఆమె తల్లి తండ్రులు పసుపు, కుంకుమ ఇచ్చి కాన్పు కోసం మదనపల్లెకు తీసుకు వచ్చారు. మంగళవారం అక్టోబర్ 5వ తేదీన భర్తకు ఫోన్ చేసి వైఎస్సార్ కడప జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్ట్ లోకి దూకుతున్నానని చెప్పింది.
ఆమె మదనపల్లె నుంచి వెలిగల్లు ప్రాజెక్ట్ వద్దకు వచ్చిందని తెలుసుకున్న భర్త మారుతి హుటాహుటిన వెలిగల్లు ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ భార్య కోసం వెతుకగా ఒక చోట చెప్పులు కనపించాయి. కానీ మనిషి కనపడలేదు. అవి చూసి మారుతీ పోలీసులకు, తహసిల్దార్ కు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు పుష్పావతికోసం గాలిస్తున్నారు. ప్రాజెక్ట్ లోకి దూకిందా… లేక ఎక్కడికైనా వెళ్లిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.