ప్రియాంక హత్య కేసు : చిలుకూరు బాలాజీ టెంపుల్ మూసివేత

  • Publish Date - December 1, 2019 / 08:26 AM IST

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనకు నిరసనగా రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ  దేవాలయం చిలుకూరు బాలాజీ ఆలయాన్ని కొద్ది సేపు మూసి వేశారు. శనివారం ఉదయం 11 గంటలనుంచి 20 నిమిషాల పాటు ఆలయాన్ని మూసి ఉంచి ప్రదక్షిణలు, దర్శనాలు నిలిపి వేశారు.అనంతరం ఆలయం ఎదుట భక్తులతో మహాప్రదక్షణ చేయించారు ఆలయ అర్చకులు రంగరాజన్ .

‘రక్షిద్దాం.. రక్షిద్దాం.. స్త్రీజాతిని రక్షిద్దాం’అంటూ భక్తులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ మహాప్రదక్షణ నిర్వహించారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగకపోవడంపై రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.

9 నెలల పాప నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు రక్షణ లేకుండాపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మహిళలు సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించామని చెప్పారు. ప్రియాంక పై జరిగిన కీచకుల దాడి పట్ల సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.