MMTS Incident : హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైలు బోగీలో ఒంటరిగా ఉన్న యువతిపై లైంగిక దాడి యత్నం ఘటనపై రైల్వే పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేసు దర్యాఫ్తు చేసిన పోలీసులు నిందితుడి కోసం రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. ఆ మృగాడి కోసం వేట మొదలు పెట్టారు. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేయడంతో ఆమె తలకు బలమైన గాయమైనట్లు రైల్వే ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. తలకు తీవ్ర గాయమైందని, కాలు విరిగిందని, ప్రస్తుతం కోలుకుంటోందని వివరించారు.
అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్ లో ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తోంది. తన సెల్ ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ వెళ్లింది. పని ముగించుకున్న అనంతరం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఎంఎంటీఎస్ లో మేడ్చల్ కు బయలుదేరింది. మహిళల కోచ్ లో ఆమె ఎక్కింది. అదే బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ లో దిగిపోయారు. బోగీలో యువతి ఒక్కటే ఉంది. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు చేయి పట్టుకుని రూమ్ కి రావాలని బలవంతం చేశాడు.
యువకుడి నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు అతడిని ఏమార్చే ప్రయత్నం చేసింది. సరే వస్తానని చెప్పి చెయ్యి విడిపించుకుంది. ఆ తర్వాత మృగాడు ఏమరపాటులో ఉండగా.. ఒక్కసారిగా యువతి కదులుతున్న రైలు నుంచి దూకేసింది.
Also Read : తెలంగాణ ఎమ్మెల్యేలకు హెడెక్‌గా హనీ ట్రాప్ కాల్స్.. ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతున్న ప్రజాప్రతినిధులు
కొంపల్లి సమీపంలో రైలు బ్రిడ్జి దగ్గర ఆమె పడిపోయింది. యువతికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతోనే ఆమె తన స్నేహితులకు ఫోన్ చేసింది. వెంటనే యువతి దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
”ఒక వ్యక్తి ఆ అమ్మాయి చేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు. నా రూమ్ కి రావాలన్నాడు. భయపడిపోయిన అమ్మాయి వాడి నుంచి తప్పించుకోవడానికి సరే అని చెప్పింది. దాంతో వాడు చేతిని కాస్త లూజ్ చేశాడు. వాడి నుంచి నేను తప్పించుకోలేను, లైంగిక దాడి చేస్తానని భయపడిన యువతి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసింది. తర్వాత వాళ్ల ఫ్రెండ్స్ కి ఫోన్ చేసింది. వాళ్లు యువతిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
తర్వాతి రోజు మధ్యాహ్నం వరకు బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. రైల్లో నుంచి దూకేశాను అని మాత్రమే ఆసుపత్రి వాళ్లకు చెప్పింది. తర్వాత పోలీసులు కంప్లైంట్ తీసుకుని ఆమె స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్న సమయంలో అసలు విషయం చెప్పింది. ఒక దుండగుడు లైంగికంగా వేధించాడని తెలిపింది. ఆమె స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాఫ్తు చేపట్టాం. టీమ్స్ ను ఏర్పాటు చేసి ఎవిడెన్స్ కోసం పంపించాం. చాలా ప్రోగ్రెసివ్ గా దర్యాఫ్తు జరుగుతోంది” రైల్వే ఎస్పీ చందన దీప్తి తెలిపారు.