Road Accident Krishna District
Road accident in Krishna Disrtict, 6 died : కృష్ణా జిల్లాలో ఆదివారం తెల్లవారు ఝూమున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరోకరు ఆస్పత్రిలో మరణించారు.
నూజివీడు మండలం గొల్లపల్లివద్ద వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను గుర్తుతెలియని లారీ ఢీ కొట్టింది. ఈఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన 9 మందిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడిన ఎనిమిదిమందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
నూజివీడు మండలం లయన్ తండాకు చెందిన14 మంది వ్యవసాయ కూలీలు బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో కుప్ప నూర్పిడి పనులకు ఆటోలో వెళుతుండగా గొల్లపల్లివద్ద ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలంలోనే చనిపోయిన వారిని రమేష్, నాగరాజు, బాణావతు స్వనా, భూక్య సోమ్లా, బర్మావత్ బేబీ.. ఆస్పత్రిలో చనిపోయిన వ్యక్తిని బాణావతు నాగుగా అధికారులు గుర్తించారు.
సమాచారం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడం తనను ఎంతో బాధించిందన్నారు. పొట్ట చేతబట్టి బతుకు దెరువు కోసం వెళ్తున్న కూలీలు ఇలా మృత్యువాత పడడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్ధిస్తూ.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. అవసరమైన వారిని మెరుగైన చికిత్స కొసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలని ఆళ్లనాని డీఎంహెచ్ వో ను ఆదేశించారు.