Road accident : మిర్యాల‌గూడ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు చిన్నారులు స‌హా ఐదుగురు దుర్మ‌ర‌ణం

మిర్యాల‌గూడ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చేసుకుంది.

Road accident in Miryalaguda five People dead including two childern

Road accident : మిర్యాల‌గూడ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చేసుకుంది. నార్క‌ట్‌ప‌ల్లి – అద్దంకి హైవేపై కృష్ణాన‌గ‌ర్ బైపాస్ వ‌ద్ద ఆదివారం అర్థ‌రాత్రి ఓ కారు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. వెన‌క నుంచి వేగంగా వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న వారిలో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు, ఓ మ‌హిళ ఉంది. మ‌రో మ‌హిళ తీవ్రంగా గాయ‌ప‌డింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన మ‌హిళ‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మృతుల‌ను మిర్యాల‌గూడ నందిపాడు కాల‌నీకి చెందిన చెరుప‌ల్లి మ‌హేశ్ (32), అత‌డి భార్య జ్యోతి (30), కూతురు రిషిత (6), మ‌హేశ్ తోడ‌ల్లుడు వ‌లిగొండ మండ‌లం గొల్నెప‌ల్లికి చెందిన భూమా మ‌హేంద‌ర్ (32), ఆయ‌న కొడుకు లియాన్సీ (32) గా గుర్తించారు. మ‌హేంద‌ర్ భార్య మాధ‌వి తీవ్రంగా గాయ‌ప‌డ‌డంతో మిర్యాల‌గూడ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది.

కాగా.. వీరంతా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ‌, ఇత‌ర ప్రాంతాల‌కు దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్లి వ‌స్తున్నారు. మ‌రో ప‌ది నిమిషాల్లో ఇంటికి చేరుతామ‌నగా ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.