పగలు రెక్కీ..రాత్రి చోరీ : బేగంపేట్‌లో రూ. 23 లక్షలు కాజేశాడు

  • Publish Date - December 13, 2020 / 01:28 PM IST

robbed 6 offices in 2 hours In Hyderabad : తాళం వేసి ఉన్న కార్యాలయాలే అతడి టార్గెట్‌.. కేవలం రెండు గంటల్లో ఆరు కార్యాలయాలను దోచేశాడు. దొరికినంత సొత్తుతో చెక్కేశాడు. ఒక కార్యాలయంలో 23 లక్షల రూపాయలు… మరి కొన్ని ఆఫీసుల్లో రూ. 5 వేల నుంచి రూ. 20 వేల లోపు నగదును కాజేశాడు. బాధితుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న హైదరాబాద్‌ పోలీసులు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఎయిర్‌లైన్‌ కాలనీలో కూకట్‌పల్లికి చెందిన రాథోడ్‌ మూడు సంవత్సరాల నుంచి రాయల్‌ కార్గో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు. వారం రోజుల క్రితం స్థలం కొనుగోలు కోసం రూ. 23 లక్షలు తీసుకొచ్చి కార్యాలయంలోని బీరువాలో దాచారు. తర్వాత రోజు రాథోడ్‌ ఆఫీసుకు వచ్చి చూడగా తాళం పగలకొట్టి ఉంది. డబ్బు కనబడలేదు. దీంతో రాథోడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఫీసు దగ్గర ఉన్న సీసీ ఫుటేజీ పరిశీలించగా చేతికి గ్లౌజులు, ముసుగు ధరించిన వ్యక్తి తాళం పగలగొట్టి లోపలకు వెళ్లడం రికార్డయింది. ఎలాంటి శబ్దం రాకుండా తాళ్లాన్ని క్షణాల్లో తొలగించాడు. కార్యాలయంలోకి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోయాడు.

ఇదే కాలనీలో మరో ఐదు కార్యాలయాల్లో తాళాలు తీసి చోరీలకు పాల్పడ్డాడు. అయితే సంబంధిత ఆఫీసుల్లో పెద్దగా నగదు లేకపోవడంతో ఉన్న వరకు తీసుకుని వెళ్లిపోయాడు. ఒకచోట 5 వేల రూపాయలు.. మరో చోట 3వేల రూపాయలు.. ఇంకో ఆఫీసులో 10 వేల రూపాయలు.. ఇలా ఉన్న నగదుతో ఉడాయించాడు. మరోవైపు గంటల వ్యవధిలోనే కార్యాలయాలను కొల్లగొట్టడం సామాన్య దొంగలతో అయ్యేపని కాదని పోలీసులు భావిస్తున్నారు. ఫింగర్‌ ప్రింట్స్‌, సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.