ఇరాన్ మద్దతుతో నడుస్తున్నపాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్(PIJ)’ అనే మిలిటెంట్ గ్రూప్ టాప్ కమాండర్ ని వైమానిక దాడిలో ఇజ్రాయెల్ చంపేసింది. గాజాలో పీఐజే రెండో అతిపెద్ద మిలిటెంట్ సంస్థ. చనిపోయిన కమాండర్ పేరు బహా అబూ అల్-అటా. ఇతడి ఇంటిపై ఇజ్రాయెల్ క్షిపణిని ప్రయోగించడంతో ఆయనతోపాటు భార్య చనిపోయారని పీఐజే తెలిపింది. గాజా, డమాస్కస్‌లలో ఇజ్రాయెల్ దాడులు సోమవారం రాత్రి జరిగాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య పెరిగిన ఉద్రిక్తతలను ఈ దాడులు సూచిస్తున్నాయి.
గాజా నగరంలోని షెజాఇయా డిస్ట్రిక్ట్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో అల్-అటా దంపతులు నిద్రపోతుండగా ఇజ్రాయెల్ ఈ దాడి జరిపిందని పాలస్తీనాలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అల్-అటా దంపతుల పిల్లలు నలుగురు, ఒక పొరుగింటి వ్యక్తి ఈ దాడిలో గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. అల్-అటా ఒక ‘టైంబాంబ్’ అని,ఉగ్రవాద దాడులకు అతడు సన్నాహాలు చేస్తున్నాడని ఇజ్రాయెల్ తెలిపింది. అల్-అటా చనిపోయిన సమయంలోనే సిరియా రాజధాని డమాస్కస్‌లో పీఐజే మరో సీనియర్ కమాండర్ అక్రమ్ అల్-అజౌరీ నివాసంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపిందని సిరియా ప్రభుత్వ వార్తాసంస్థ సనా తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారని, 10 మంది గాయపడ్డారని చెప్పింది. మృతుల్లో అల్-అజౌరీ ఉన్నాడా, లేదా అన్నది స్పష్టం కాలేదు. మృతుల్లో అతడి కొడుకు మోవజ్ ఉన్నాడని సిరియా సనాతెలిపింది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. అల్-అటా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని పీఐజే ప్రకటించింది.
అల్-అటా మృతితో గాజా నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడులు జరిగాయి. దాదాపు 50 రాకెట్లను ప్రయోగించారు. వీటిలో కొన్ని గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ నగరం సోడెరాట్‌ను తాకాయి. గాజా రాకెట్ దాడుల్లో 25మంది ఇజ్రాయెలీలు గాయపడినట్లు సమాచారం, కొన్ని నెలలుగా పీఐజే ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద దాడులకు, చాలా రాకెట్ దాడులకు పాల్పడిందని, మరిన్ని ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతోందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
పీఐజే కేంద్ర కార్యాలయం డమాస్కస్‌లో ఉంది. ఇది గాజాలోనూ కార్యకలాపాలు సాగిస్తుంది. గాజాను నియంత్రించే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ ‘హమాస్’కు పీఐజేను ప్రత్యర్థిగా భావిస్తారు. అయితే అల్-అటాను చంపేయడాన్ని హమాస్ ఖండించింది. ఈ హత్యకు ఇజ్రాయెల్ శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించింది.