Lakhimpur Case : అశిష్ మిశ్రా బెయిల్ రద్దు.. వారంలో లొంగిపోవాలి.. సుప్రీంకోర్టు ఆదేశం!

Lakhimpur Case : యూపీలోని లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా బెయిల్ రద్దు అయింది.

Ashish Misra

Lakhimpur Case : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు అశిష్ మిశ్రా బెయిల్ రద్దు అయింది. ఈ మేరకు సుప్రీం కోర్టు సోమవారం (ఏప్రిల్ 18) తీర్పు వెలువరించింది. అశిష్ మిశ్రాను వారం రోజుల్లోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో అశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

అయితే లఖింపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. దాంతో లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు వివ‌రాల‌ను సుప్రీం ఉత్త‌రప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి తెలియ‌జేసింది. వ‌చ్చే సోమ‌వారంలోగా బెయిల్ ర‌ద్దుకు సంబంధించి ప్ర‌భుత్వ వైఖ‌రిని తెలియజేయాలంటూ యూపీ ప్ర‌భుత్వాన్ని సుప్రీం కోరింది.

కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ గతేడాది అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో రైతులు నిరస‌న తెలిపారు. రైతుల నిరసన తెలుపుతున్నప్రాంతంలో కేంద్ర మంత్రికి చెందిన వాహ‌నాల కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

అనంతరం జరిగిన హింసాకాండలో ఇద్దరు బీజేపీ నేతలు, ఓ డ్రైవ‌ర్ కూడా మృతిచెందారు. ఈ హింసాకాండ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న అశిష్ మిశ్రాతో పాటు ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 10న అలహాబాద్ హైకోర్టు ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ ను స‌వాలు చేస్తూ గ‌త నెల 21వ తేదీన బాధితుల బంధువులు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Read Also : Lakhimpur Kheri Case: నాలుగు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన మంత్రి కొడుకు