Secunderabad Fire Accident : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. ఆ ముగ్గురు సజీవదహనం?

సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు కూలీలు సజీవదహనం అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన ముగ్గురు యువకుల మొబైల్ లొకేషన్ ప్రమాదం జరిగిన భవనంలోనే చూపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Secunderabad Fire Accident : సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు కూలీలు సజీవదహనం అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన ముగ్గురు యువకుల మొబైల్ లొకేషన్ ప్రమాదం జరిగిన భవనంలోనే చూపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ముగ్గురు యువకులు భవనంలోనే చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఒకవేళ యువకులు భవనంలో చిక్కుకుపోయి ఉంటే, ముగ్గురూ సజీవదహనం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. యువకుల అదృశ్యంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

బిల్డింగ్ నుంచి వేడి సెగలు వెలువడుతుండటంతో పాటు పొగ కమ్మేయడంతో భవనంలోకి క్లూస్ టీమ్ వెళ్లలేకపోతోంది. దీంతో డ్రోన్ ద్వారా బిల్డింగ్ లోపలి పరిస్థితులు అంచనా వేస్తోంది. డ్రోన్ ను భవనం లోపలికి పంపి ఆధారాలు సేకరిస్తోంది.

Also Read..Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. అదుపులోకి వచ్చిన మంటలు

ఆ ముగ్గురు వ్యక్తుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ వాళ్లు ఏమయ్యారో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. మంటల్లో ఆ ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యి ఉండొచ్చు అనే వార్తలో కుటుంబసభ్యులను మరింత వేదనకు గురి చేస్తున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కుటుంబసభ్యులు తమ వారి ఆచూకీ చెప్పాలని పోలీసులను అడుగుతున్నారు.

ముగ్గురు వ్యక్తులు ఆ భవనంలో కూలీలుగా పని చేస్తున్నారు. ఆ ముగ్గురు బిల్డింగ్ లోపలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వారు తిరిగి బయటకు వచ్చారా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇప్పటికైతే వారి సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బిల్డింగ్ లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మంటల్లో ముగ్గురూ సజీవదహనం అయినట్లు, కనీసం వారి ఆనవాళ్లు గుర్తించేందుకు వీలు లేని విధంగా వారి శరీరాలు దగ్దమైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read..Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. 5, 6వ అంతస్తులకు లేని అనుమతులు

మరోవైపు బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉండటంతో.. ఆ భవనాన్ని కూల్చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించి చర్చిస్తున్నారు. సుమారుగా 10 గంటలకు పైగా ఆ భవనంలో మంటలు చెలరేగాయి.

అదృశ్యమైన ముగ్గురు కూలీలు కూడా బీహార్ కు చెందిన వారు. పని చేసుకునేందుకు కొన్నేళ్ల క్రితం వారంతా బీహార్ నుంచి వచ్చారు. జువైన్, వసీం, అక్రమ్ లు ఈ అగ్నిప్రమాద ఘటనలో చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. వేడి, పొగ తగ్గిన తర్వాత క్లూస్ టీమ్ బిల్డింగ్ లోకి వెళ్లే చాన్సుంది. మరోవైపు రంగంలోకి దిగిన నిపుణులు కూల్చివేత పనులపై డిస్కస్ చేస్తున్నారు. ఈరోజు నుంచే కూల్చివేత పనులు ప్రారంభించాలా? లేక రేపటి నుంచి స్టార్ట్ చేయాలా? అని చర్చిస్తున్నారు.

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడం తెలిసిందే. ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనంలో 10 గంటలకు పైగా మంటలు ఎగసిపడ్డాయి. మూడు వైపుల నుంచి మొత్తం 15 ఫైరింజన్లను మోహరించి మంటలు ఆర్పేశారు. అగ్నికీలలను అదుపులోకి తెచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. కాగా, దట్టమైన పొగ కారణంగా పలువురు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోపక్క, డెక్కన్ స్పోర్ట్స్ మాల్ కు పక్కనే ఉన్న నాలుగు భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ముందు జాగ్రత్తగా.. పరిసరాల్లోని భవనాల్లో నివసిస్తున్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. ఆ ప్రాంతంలో ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు.

ట్రెండింగ్ వార్తలు