Visakha Kidney Racket Case
Visakha Kidney Racket Case : విశాఖ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలు బటయపడుతున్నాయి. బాధితుడు వినయ్ కుమార్ తో పాటు తిరుమల ఆసుపత్రిలో మరికొంతమందికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగినట్లుగా తెలుస్తోంది. వాంబే కాలనీకి చెందిన శ్రీను, గౌరి, ఎలినా, కొండకు కిడ్నీ మార్పిడీ ఆపరేషన్ చేసినట్లు సమాచారం.
ఈ మొత్తం కిడ్నీ రాకెట్ లో ఎలినా, కామరాజు కీలకంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, బాధితులు బయటకు వచ్చేందుకు భయపడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాఫ్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని వాంబే కాలనీ వాసులు అంటున్నారు.
తిరుమల ఆసుపత్రిని పరిశీలించిన ఏసీపీ మూర్తి.. మెడికల్ టీమ్స్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారం శిక్షలు కఠినంగా ఉంటాయని చెప్పారు.
కిడ్నీ రాకెట్ కేసు.. చైన్ లింక్ వ్యవహారంగా చెప్పుకుంటున్నారు. కేవలం వినయ్ కుమార్ మాత్రమే కాదు.. అనేకమంది తిరుమల హాస్పిటల్ లో కిడ్నీ మార్పిడి చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం డబ్బుకు ఆశపడి వీళ్లంతా కిడ్నీలు అమ్ముకున్నారు. కిడ్నీ మార్పిడి వ్యవహారం వాంబే కాలనీలో సంచలనంగా మారింది. ఈజీ మనీ కోసం తమ అవయవాలు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. పోలీసులతో పాటు జిల్లా అధికారులను హాస్పటల్ కి పంపించారు. ఇప్పటికే తిరుమల ఆసుపత్రిలో డీఎంహెచ్ఓ విచారణ పూర్తైంది.(Visakha Kidney Racket Case)
ఆర్దోపెడిక్ డాక్టర్ పరమేశ్వర్ ను పోలీసులు, డీఎంహెఓ విచారించారు. ఆర్దోపెడిక్ సంబంధించిన వైద్యం మాత్రమే చేస్తున్నట్లు, ఆపరేషన్ కు సంబంధించి ఎలాంటి నిర్వహణ లేదని కూడా పరమేశ్వర్ చెప్పారు. అయితే, అక్కడ అవయవ మార్పిడికి సంబంధించి అక్కడ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉందని డీఎంహెచ్ఓ పరిశీలనలో తేలింది.
అయితే, ఆ ఆసుపత్రిలో ఆపరేషన్లు నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు లేవు. దీనికి సంబంధించిన నివేదికను కలెక్టర్ కి అందజేస్తామన్నారు డీఎంహెచ్ఓ. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిని సీజ్ చేస్తామన్నారు. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి. వాటన్నింటిని తుంగలోకి తొక్కేశారు. బంధువులు ఇస్తే మాత్రమే అవయవాలు సేకరించాలి. దానికి కూడా అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని కూడా పాటించలేదు.
థర్డ్ పార్టీ ద్వారా ఆర్గన్స్ మార్పిడి చేయడం జరిగింది. మెడికల్ బోర్డు అనుమతులు తీసుకున్న తర్వాతే అవయవమార్పిడి చేయాల్సి ఉంటుంది. అది కూడా నెంబర్ వైజ్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం కిడ్నీ మార్పిడి రాకెట్ వ్యవహారంలో స్రవంతి అనే డాక్టర్ కీలకంగా వ్యవహరించింది. స్రవంతికి, మధ్యవర్తులకు ఎలా పరిచయం ఏర్పడింది? అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న డాక్టర్, మధ్యవర్తులు అంతా దొరికితే డొంకంతా కదిలే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయి.(Visakha Kidney Racket Case)
వాంబే కాలనీలో ఆర్థికంగా బలం లేని వారే ఉంటారు. వారికి డబ్బు ఎరవేసి కిడ్నీ మార్పిడి చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా వినయ్ కుమార్ వ్యవహారంతో ఇదంతా బయటకు వచ్చింది. వినయ్ కి రూ.8లక్షల 50వేలు ఇస్తామని చెప్పారు. ఆ మొత్తం డబ్బు అతడికి అందినట్లు అయితే వినయ్ కుమార్ కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే, మొత్తం డబ్బులు ఇవ్వకపోవడంతో వినయ్ కుమార్ స్థానికులకు ఈ విషయం చెప్పాడు. స్థానికుల సాయంతో పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
Also Read..Visakha Swetha Case : విశాఖ శ్వేత కేసులో మరో సంచలనం
అసలు ఎలా జరిగింది?
మధురవాడ వాంబే కాలనీకి చెందిన డ్రైవర్ వినయ్ కుమార్.
అదే కాలనీకి చెందిన కిడ్నీ రాకెట్ ముఠా మధ్యవర్తి కామరాజుతో వినయ్ కుమార్ కు పరిచయం.
కిడ్నీ ఇచ్చేందుకు రూ.8.50లక్షలకు డీల్.
వినయ్ కు వైద్య పరీక్షలు చేయించిన కిడ్నీ రాకెట్.
వినయ్ తల్లిదండ్రులకు తెలిసిన డీల్ వ్యవహారం.
తల్లిదండ్రులు తిట్టడంతో కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకోని వినయ్.
వినయ్ ను బెదిరించిన కిడ్నీ రాకెట్ ముఠా.
బలవంతంగా పెందుర్తిలోని తిరుమల ఆసుపత్రికి వినయ్ ని తీసుకెళ్లిన ముఠా.
గతేడాది డిసెంబర్ 16న వినయ్ కుమార్ కు ఆపరేషన్.
మత్తుమందు ఇచ్చి వినయ్ కుమార్ కిడ్నీ తీసేసిన డాక్టర్లు.
ఆపరేషన్ తర్వాత రూ.2.50లక్షలు మాత్రమే ఇచ్చిన మధ్యవర్తి కామరాజు.
మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేసిన వినయ్.
వినయ్ కుమార్ వాదన..
పేదరికం వల్లే కిడ్నీ ఇచ్చేందుకు మొదట ఒప్పుకున్నా.
తల్లిదండ్రులు తిట్టడంతో వెనక్కి తగ్గా.
కిడ్నీ రాకెట్ ముఠా నన్ను బెదిరించింది.
ఆటోలో బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేశారు.
బలవంతంగా కిడ్నీ తీసుకున్నారు.
డబ్బులు కూడా తక్కువ ఇచ్చి మోసం చేశారు.