seven members of muthoot finance thieves held near hyderabad : తమిళనాడులోని హోసూరు లోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో నిన్న భారీ చోరీ జరిగింది. ముత్తూట్ సిబ్బందిని తాళ్లతో కట్టేసి దుండగులు సుమారు 25 కేజీల బంగారం, 96వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. అయితే దుండగులు హోసూరు నుంచి హైదరాబాద్ మీదుగా, జార్ఖండ్, బీహార్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
ఈ క్రమంలో తమిళనాడు నుంచి జాతీయ రహాదారి 44పై వెళుతున్న దుండగుల వాహనాన్ని తెలంగాణ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివార్లలో సైబరాబాద్ పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన బంగారం విలువ సుమారు రూ. 7.5 కోట్లు ఉంటుందని అంచనా. బంగారంతో పాటు రూ. 96 వేల రూపాయల నగదుకూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం, జనవరి 22 వతేదీ ఉదయం బెంగళూరు సమీపంలోని తమిళనాడుకు చెందిన హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ లోకి సాయుధులైన ఏడుగురు దుండగులు చొరబడి రూ.7 కోట్ల విలువ చేసే నగలు, నగదును దోచుకెళ్లారు. శుక్రవారం ఉదయం దుండగులు మాస్క్‌లు, హెల్మెట్లు ధరించి బ్రాంచ్ లోకి చొరబడ్డారు. కత్తులు, తుపాకులతో సిబ్బందిని బెదిరించి తాళ్లతో కట్టేసి సమారు 25 కేజీల బంగారు నగలు, రూ.96 వేల నగదును బ్యాగుల్లో సర్దుకుని పరారయ్యారు.
విషయం తెలిసిన హోసూరు డీఎస్పీ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. దుండగులు హిందీలో మాట్లాడారని, ఉత్తరాది వారిగా అనుమానిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ్నించి దుండగులు బైక్ లపై పరారయ్యారు. హోసూర్ డీఎస్పీ సరిహద్దు రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. అన్ని టోల్ గేట్ల వద్ద పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. హోసూరు డీఎస్పీ అలర్ట్ తో …. అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు, సాంకేతిక సహాయంతో టోల్ గేట్ సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగలను పట్టుకున్నారు.
ఎన్‌హెచ్ 44పై దుండగులు నార్త్ ఇండియా వైపు వెళ్తుండగా సైబరాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఐదుగురిని తొండుపల్లి గేట్ వద్ద అదుపులోకి తీసుకోగా…. మరో ఇద్దరిని మేడ్చల్ వద్ద అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిలో 1. రూప్ సింగ్ భగాల్(22, మధ్యప్రదేశ్),2. శంకర్ సింగ్ బయ్యాల్(మధ్యప్రదేశ్),3. పవన్ కుమార్ బిస్కార్మ(జార్ఖండ్),4. భూపేందర్ మాంజీ(24, జార్ఖండ్),5. వివేక్ మండల్(32, జార్ఖండ్),6. టికారం(55, ఉత్తరప్రదేశ్),7. రాజీవ్ కుమార్ (35, ఉత్తరప్రదేశ్) లు ఉన్నారు.