మూడేళ్ల పిల్లాడిని కిడ్నాప్ చేసి రూ.కోటి డిమాండ్..రెండు గంటల్లోనే..

మూడేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసిన వ్యక్తిని తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పోలీసులు కేవలం రెండుగంటల్లోనే పట్టుకుని కటకటాల్లో పడేశారు. సొంత బంధువే ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడు. కానీ దొరికిపోయి కటకటాల్లో పడ్డాడు. వేసుకున్న ప్లాన్ అట్టర్ ప్లాప్ కావటంతో ఏమీ చేయలేక..ఊచలు లెక్కపెడుతున్నాడు.
పోలీసుల కథనం ప్రకారం..ముబారక్ తిరువల్లూరు జిల్లాలోని ఆర్కేపేట ఇస్లాంనగర్‌కు చెందిన ముబారక్ బాషా అనే 40 ఏళ్ల వ్యక్తికి షోళింగర్‌లో చికెన్ దుకాణం ఉంది.దానిమీదనే అతని కుటుంబం జీవిస్తోంది. ముబారక్ కు పర్వేష్ (9), రిష్వంత్ (6), అజారుద్దీన్ (3) అనే ముగ్గురు కొడుకులున్నారు.
వీరిలో చివరివాడు అజారుద్దీన్ శనివారం (ఆగస్టు 22,2020) ఇంటి బయట ఆడుకుంటూ మాయం అయ్యాడు. దీంతో బాడు కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కలంతా వెదికారు. కానీ కనిపించలేదు. దీంతో ఆందోళన చెందుతుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. పిల్లాడిని తానే కిడ్నాప్ చేశానని..కోటి రూపాయలు ఇస్తే వదిలిపెడతానని..లేదా చంపేస్తానని..పోలీసులకు చెబితే పిల్లాడ్ని చంపేసి పార్శిల్ పంపిస్తానని బెదిరిస్తూ హెచ్చరించాడు.
చికెన్ షాపు నడుపుకునే నా దగ్గర కోటి రూపాయలు ఎక్కడుంటాయి. నాకొడుకు పరిస్థితి ఏంటీ అంటూ ముబారక్ హడలిపోయాడు. ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో వేరే దారి లేక భయపడుతూ వెళ్లి ముబారక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే నాకొడుకును కాపాడండయ్యా..లేదంటే చంపేస్తాడేమోనని వేడుకున్నాడు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ముబారక్‌కు వచ్చిన ఫోన్ నంబరు సిగ్నల్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. విషయం పోలీసులకు చేరిందని తెలుసుకున్న కిడ్నాపర్ వంగనూరు క్రాస్‌రోడ్డు వద్ద బాలుడిని వదిలి పరారయ్యాడు. అక్కడ ఏడుస్తున్నపిల్లాడిని చూసిన స్థానికులు చేరదీశారు. తరువాత పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు.
ఆ బాలుడే ముబారక్ కొడుకు అయి ఉంటాడనుకున్న పోలీసులు అజారుద్ధీన్ ఫోటోతో పట్టుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని గుర్తించి.. తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. అదే గ్రామానికి చెందిన ముబారక్ బంధువైన సులైమాన్ అనే 30 ఏళ్ల యువకుడు బాలుడిని కిడ్నాప్ చేసినట్టు పోలీసుల విచారణ తేలడంతో అతడిని అరెస్ట్ చేశారు. డబ్బు కోసం బంధువు బిడ్డనే కిడ్నాప్ చేసి కటకటాలపాలయ్యాడు.