సొంతూరులో పెళ్లి చేసుకోవటం ఇష్టంలేక…

సొంతూరులో పెళ్లి చేసుకోవటం ఇష్టంలేక…

Updated On : June 22, 2021 / 11:38 AM IST

పెళ్లి మీద ఒక్కోక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. ఫలానా ఉద్యోగం చేసే అబ్బాయిని చేసుకోవాలని, అందంగా ఉండాలని ఇలా ఏవేవో కోరికలు ఉంటాయి. అలాగే ఆ అమ్మాయికి కోరికలు ఉన్నాయి. చిన్నకోరికే అయినా తల్లి తండ్రులు ఆమె మాటను పక్కన పెట్టి వాళ్లు అనుకున్నవిధంగానే పెళ్లి చేయాలనుకున్నారు. అలా పెళ్లి  చేసుకోవటం ఇష్టంలేని యువతి సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

తమిళనాడులోని తంజావూరు కు చెందిన మణి అనేవ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు. వారిలో ఇద్దరు కుమార్తెలకు ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు కు చెందిన వారికి ఇచ్చి గతంలోనే వివాహం చేశాడు. చిన్నకూతురు రాజేశ్వరి(23) కోయంబత్తూరులో ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తోంది.

లాక్ డౌన్ కు ముందు ఆమె నెల్లూరులోని కొత్తూరులో ఉంటున్న తన సోదరి విజయలక్ష్మి ఇంటికి వచ్చింది. అప్పటినుంచి ఆమె అక్కడే ఉంటోంది. తల్లితండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు తంజావూరు లోనే వారి సమీప బంధువుతో వివాహాం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

కాగా…తనకు తంజావూరులో పెళ్లిచేసుకుని ఉండటం ఇష్టం లేదని, అక్కలిద్దరి మాదిరిగానే నెల్లూరులో సంబంధం చూడమని రాజేశ్వరి తల్లితండ్రులకు చెప్పింది. నెల్లూరులో ఉంటే అక్కచెల్లెళ్లు ముగ్గురం ఒకే ఊరిలో ఉంటామని తన మనసులో కోరిక బయట పెట్టింది.

ఆమె తల్లితండ్రులు కూతురు మాటలు వినిపించుకోలేదు. తంజావూరు సంబంధం ఖాయంచేయటానికి మొగ్గు చూపారు. ఈ నేపధ్యంలో జులై 8 వ తేదీ రాత్రి విజయలక్ష్మి ఆమె కుటుంబ సభ్యులు ఇంటి బయట మాట్లాడుకుంటుంటే రాజేశ్వరి ఇంట్లోని దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వచ్చి చూసిన విజయలక్ష్మి, రాజేశ్వరి ఆత్మహత్య చేసుకోవటంతో … పెద్దగా కేకలు వేసింది.

దీంతో అందరూ లోపలికి వచ్చి దూలానికి వేలాడుతున్నరాజేశ్వరిని కిందకు దింపి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్లు తెలిపారు. విజయలక్ష్మి భర్త శరవణ్ కుమార్ బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.