హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోయిన అల్లరి మూకలు

  • Publish Date - May 2, 2019 / 06:55 AM IST

హైదరాబాద్ పాతబస్తీలో అల్లరి మూకలు రెచ్చిపోయారు. కాలాపత్తర్, ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ల పరిధిలో బీభత్సం సృష్టించారు. ఇనుప రాడ్లతో దాడులకు తెగబడ్డారు. పలు షాపులపై దాడి చేశారు. అల్లరి మూకల దాడిలో రెండు కార్లు, రెండు ఆటోలు, మెడికల్ షాపు, హోటల్ కౌంటర్ ధ్వంసమైంది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్నపోలీసులు పాతబస్తీలో భారీగా బలగాలను మోహరించాయి.
Also Read : పట్టపగలు.. నడిరోడ్డుపై : హైదరాబాద్ సిటీ బస్సులో కాల్పులు

కమాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని రంజాన్ కాలనీలో బిస్మిల్లా హోటల్ పై అల్లరి మూకలు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఇమ్రాన్, అలీ, మున్నులు అనే ముగ్గురు హోటల్ లోకి ప్రవేశించి యజమానితో గొడవకు దిగారు. రాళ్లు, కత్తులతో హోటల్ లోని ఫర్నీచర్స్, హోటల్ కౌంటర్ ధ్వంసం చేశారు. వారిని చంపేస్తామని బెదిరించారు. దీంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న కమాటిపుర, ఫలక్ నుమా పోలీసులు చార్మినార్ డివిజన్ ఏసీపీ అంజయ్య నేతృత్వంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్, టాస్క్ ఫోర్స్ టీమ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 
Also Read : వర్మ పంతం నెగ్గింది: ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలైంది.. కానీ!