తమిళనాడులో పరువు హత్య కలకలం రేపింది. దళితుడిని ప్రేమించిందంనే కోపంతో కన్నతల్లి కూతుర్ని కడతేర్చింది. కూతుర్ని కిరసనాయిల్ పోసి తగల బెట్టి అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… వాజ్మంగళం అనే గ్రామానికి చెందిన ఉమా మహేశ్వరి, కన్నన్ దంపతులకు జనని(17) అనే కుమార్తె ఉంది. కన్నన్ కార్పెంటర్‌గా పనిచేస్తుండగా.. ఉమా రోజూవారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో మైనర్ అయిన జనని..అదే గ్రామానికే చెందిన ఓ దళిత యువకుడిని ప్రేమించింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన జనని.. వచ్చే నెలలో మేజర్ కానుండటంతో అతడిని పెళ్లి చేసుకోవాలని భావించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమె ప్రేమను తిరిస్కరించి మందలించారు.
తల్లితండ్రులు తన ప్రేమను తిరస్కరించటంతో మంగళవారం, నవంబర్ 19న ప్రియుడితో కలిసి పారిపోయేందుకు జనని సిధ్దపడింది. అయితే ఈ విషయం గమనించిన జనని తల్లి ఉమామహేశ్వరి కూతురితో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తురాలైన ఉమ.. కూతురిపై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసింది. అనంతరం తాను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన జనని.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. ఇక ఉమ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉమపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కూతురి హత్యలో తండ్రి కన్నన్‌కు కూడా భాగం ఉందా ? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.