ముంబై డ్రగ్స్ కేస్ : కస్టడీ నుంచి పారిపోయి, తిరిగి వచ్చిన నటి శ్వేతాకుమారి

tollywood actress accused drugs case escapes,held, ncb custody :ముంబైలో డ్రగ్స్ పెడ్లర్లతో పట్టుబడ్డ టాలివుడ్ నటి శ్వేతా కుమారి సోమవారం ఉదయం హడావిడి చేసింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల కళ్లు గప్పి తప్పించుకు పారిపోయింది. మళ్లీ మధ్యాహ్నానికి పోలీసు విచారణకు హాజరైంది.దీంతో అధికారులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

ఎన్సీబీ అధికారుల కస్టడీలోని హోటల్ నుంచి సోమవారం ఉదయం శ్వేతా కుమారి పరారైంది. ఆమె తప్పించుకు పారిపోగానే ముంబై పోలీసులు అప్రమత్త మయ్యారు. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ముంబైలో ముమ్మర గాలింపు చేపట్టారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ శ్వేతాకుమారికి మాఫియా డాన్ కరీంలాలాతో సంబంధాలున్నట్లు తెలుసుకున్న అధికారులు కరీం కోసం దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టారు. అతను దేశం విడిచి పెట్టి వెళ్ళకుండా లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. అన్నివిమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. కాగా…శ్వేతా కుమారిమధ్యాహ్ననికి హోటల్ కు వచ్చి అధికారుల విచారణకు హాజరైంది.

జనవరి 2, శనివారం రాత్రి ముంబై లోని మీరా రోడ్డు లోని ఒక హోటల్ లో డ్రగ్స్ పెడ్లర్లు మహ్మద్‌ చాంద్‌ పాషా, సప్లయర్‌ సయ్యద్‌తో సహా శ్వేతా కుమారిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చాంద్‌ పాషా నుంచి 400 గ్రాముల డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో బాంద్రా, కుర్ల, అంధేరిలోనూ పోలీసులు విస్తృత దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ చాంద్‌, సయ్యద్‌తో టాలీవుడ్‌ నటికి ఉన్న సంబంధాలపై ఎన్‌సీబీ ఆరా తీసినట్టు తెలిసింది. నిందితురాలు తెలుగులో నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినట్టుగా తెలుస్తోంది.