ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రముఖ హిందీ టీవీ సీరియల్ నటుడు, మోడల్ సమీర్ శర్మ(44) ముంబైలో సూసైడ్ చేసుకున్నాడు. యే రిస్తే హై ప్యార్ కే సీరియల్‌లో అతను నటించాడు. టీవీల్లో పాపులర్ నటుడిగా సమీర్ శర్మకు గుర్తింపు ఉంది. కహానీ ఘర్ ఘర్ కీ(Kahaani Ghar Ghar Ki), లెఫ్ట్ రైట్ లెఫ్ట్(Left Right Left), ఇస్ ప్యార్ కో క్యా నామ్ దేవ్(Iss Pyaar Ko Kya Naam Du), ఎక్ బార్ ఫిర్, క్యూకీ సాస్ భీ కబీ బహు తీ(Kyunki Saas Bhi Kabhi Bahu Thi) సీరియళ్లలో అతను నటిస్తున్నాడు. ముంబై పశ్చిమ మలాద్‌లోని అహింసా మార్గ్‌లో తన నివాసంలో కిచెన్ సీలింగ్‌కు సమీర్ ఉరి వేసుకున్నాడు. సమీర్ శర్మ రెండు రోజుల క్రితమే సూసైడ్ చేసుకున్నట్లు మలాడ్ పోలీసులు అనుమానిస్తున్నారు.
సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతూ:
బుధవారం(ఆగస్టు 5,2020) రాత్రి సమీర్ శర్మ.. తన ఫ్లాట్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కి వేలాడుతుండగా.. అపార్ట్‌మెంట్ వాచ్ మెన్ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. సమీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఘటనా స్థలంలో ఎలాంటి సూసైట్ నోట్ లభించలేదని.. డెడ్ బాడీ నుంచి వాసన వస్తుండటంతో రెండు రోజుల ముందే చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సమీర్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. అయితే తాను డిప్రెషన్ లో ఉన్నట్లు ఇన్ స్టాగ్రామ్‌లో ఇటీవల సమీర్ ఓ పోస్టు షేర్ చేశాడు.
నటుడే కాదు మోడల్ కూడా:
సమీర్ శర్మ నటించిన సీరియళ్లన్నీ దాదాపు సూపర్‌హిట్. టీవీ సీరియళ్లతో పాటు సమీర్ శర్మ మోడల్‌గా రాణించాడు. కొన్ని టాప్ బ్రాండ్స్ అడ్వర్టయిజ్‌మెంట్లలో యాక్ట్ చేశాడు. కాగా, సమీర్ శర్మకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రాథమికంగా పోలీసులు నిర్దారించారు. మరి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనేది మిస్టరీగా మారింది.
ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు:
బాలీవుడ్ లో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. ఈ ఆత్మహత్య ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య విభేదాలకు తావిచ్చింది. ఆ కేసు వెనుక కారణాలను వెలికి తీయడానికి, రహస్యాన్ని ఛేదించడానికి చివరికి సీబీఐ రంగంలోకి దిగాల్సి వచ్చింది. సుశాంత్ సింగ్ ఘటన మర్చిపోకముందే మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం ఆవేదనకు గురి చేస్తోంది. చిత్ర, టీవీ పరిశ్రమకు చెందిన పలువురు సమీర్ శర్మ మృతి వార్త తెలుసుకుని దిగ్భ్రాంతి చెందారు. సమీర్ మృతికి పలువురు సంతాపం తెలిపారు.