ఫిలిప్పీన్స్‌‌‌లో బాంబు పేలుళ్లు, 21మంది మృతి

ఫిలిప్పీన్స్‌లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. మతోన్మాదం హద్దు మీరి ఒకటి తర్వాత మరొకటి క్షణాల వ్యవధిలో వరుస బాంబు పేలుళ్లు జరగడంతో మృతదేహాలు, శరీర భాగాల ముక్కలు గుర్తు పట్టలేనంతగా మారాయి. ఆదివారం జనవరి 27న దక్షిణ ఫిలిప్పీన్స్‌ ప్రాంతంలోని రోమన్‌ కాథలిక్‌ కాథడ్రల్‌ చర్చి లక్ష్యంగా రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ప్రమాదంలో బాధితులు వందకు పైగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వారిలో ఇప్పటి వరకూ 21 మంది మృతి చెందినట్లు, 71 మంది గాయపడినట్లు అధికారులు గుర్తించారు.

 

మొదటగా ముస్లిం మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండే జోలో ప్రాంతంలోని కాథడ్రల్‌ చర్చికి సమీపంలో బాంబు పేలింది. అనంతరం చర్చి ఆవరణలో ముష్కరులు మరో పేలుడుకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ఘటనాస్థలికి చేరుకొని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలువురిని హెలికాప్టర్లలో సమీపంలోని జాంబోంగా నగరానికి తరలించారు.

 

ఈ ఘటనపై ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి డెల్ఫిన్‌ లోరెన్జనా స్పందించారు. శాంతితో కూడిన జీవన విధానం పాటించే ప్రదేశంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ప్రాంత విభజన గురించి జరుగుతున్న వివాదాలు హద్దు మీరి ఈ ఘటన జరిగి ఉండొచ్చు. మరింత ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అన్ని ప్రాంతాల్లో భద్రత పెంచాలని ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధింత శాఖను కోరినట్లు తెలిపారు.

 

జరిగిన ఘటనకు తామే కారణమంటూ ఏ సంస్థ ఇప్పటివరకూ ప్రకటించుకోలేదు. జోలో ద్వీపంలో అబు సయ్యఫ్‌ సంస్థ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు ద్వీపానికి దగ్గర ప్రాంతంలోనే ఉంటూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. ప్రమాద స్థలి జోలో నగర సమీపంలో బడ్జెట్ హోటల్‌కు దగ్గరలో ఉండటంతో జన సంచారం ఎక్కువగా ఉంటుంది.