Two sisters fight over man claiming he is their husband in Uttarakhand : పాత తెలుగు సినిమాల్లో ఒక హీరో కోసం ఇద్దరు హీరోయిన్లు తగువులాడుకున్న సన్నివేశాలు చాలా చూశాం. ఇప్పుడు ఉత్తరాఖండ్ లో అలాంటి సీన్ ఒకటి రిపీట్ అయ్యింది. మొగుడు పెళ్లాల గొడవ చూసిన పోలీసులు ముగ్గురికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
ఉత్తరాఖండ్, హరిద్వార్ లోని రూర్కీ పోలీసు స్టేషన్ పరిధిలో వెస్ట్ అంబర్ తలాబ్ లో నివసించే ఒక వ్యక్తికి స్ధానిక మహిళతో 10 ఏళ్ల క్రితం వివాహం అయి నలుగురు పిల్లలు ఉన్నారు. గత నాలుగేళ్ల నుంచి అతను వేరే మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఎదుర్కోన్నాడు. ఈ విషయమై ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవలు జరగటం మొదలయ్యాయి. ఈ క్రమంలో అతని భార్య నాలుగు నెలల క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అతను కూడా తాను వివాహేతర సంబంధ కొనసాగిస్తున్న మహిళను తీసుకుని ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ వెళ్ళి కాపురం పెట్టాడు. దీంతో అతడి భార్య మీరట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉండగా సదరు వ్యక్తి తన రెండో భార్యను తీసుకుని గత శుక్రవారం ఉత్తరాఖండ్ లోని రూర్కీ వచ్చి పనులు ముగించుకుని తిరుగు ప్రయాణ మవ్వటానికి బస్టాండ్ కు వచ్చాడు. అదే సమయంలో అతడి మొదటి భార్య తన భర్త, చెల్లెలు కలిసి ఉండటం చూసి ఖంగుతింది. తన భర్తతో ఉన్నావేంటి అంటూ చెల్లెలితో గొడవ పడింది. అందుకు సోదరి అతడు తన భర్త అని సమాధానం ఇచ్చింది. వీళ్లిద్దరూ ఇలా బహిరంగంగా గొడవ పడుతుంటే అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చి ముగ్గురిని పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లారు. పోలీసు విఛారణలో అసలు ట్విస్ట్ బయట పడింది. మొదటి భార్యకు తెలియకుండా ఆమె చెల్లెలితోనే సదరు వ్యక్తి కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ కూడా ఈ విషయం తన అక్కకు తెలియకుండా జాగ్రత్త పడింది. మొదటి భార్య వెళ్ళిపోవటంతో ఆ వ్యక్తి మరదలిని రెండో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. అప్పటికే అతని మీద మీరట్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదై ఉండటంతో పోలీసులు అక్కడి వారికి సమాచారం ఇచ్చారు. ముగ్గురికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.