Bengaluru : ఇద్దరు అమ్మాయిల ప్రేమాయణం.. తల్లిదండ్రులను ఎదిరించి.. చివరకు విషాదాంతం
Two Women Die by Suicide In Bengaluru : తాము కలిసిఉండేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదనే మనస్థాపంతో ఇద్దరు యువతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
Two Women Die by Suicide In Bengaluru
Two Women Die by Suicide In Bengaluru : కుటుంబ సభ్యులు తమ సంబంధాన్ని అంగీకరించకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఇద్దరు నేపాలీ యువతులు మృతి చెందిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. నగరంలోని బళ్లారి రోడ్డు జక్కూరు సమీపాన ఒక హోటల్ వెలుపల చెట్టుకు ఉరివేసుకొని వారిద్దరూ మరణించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమర్టంకు తరలించారు. అయితే, చనిపోయేముందు రాసిన పెట్టిన లేఖను పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సిర్జనా (22), రీటా (23) ఇద్దరు యువతులు నేపాల్‌కు చెందిన వారు. వారిద్దరూ బంధువులు. చిన్నతనం నుంచి ఒకే ఊరి పాఠశాలలో చదుకున్నారు. చిన్నతనం నుంచే కలిసిమెలిసి ఉంటున్న వారు.. కొంతకాలం తర్వాత ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. పెండ్లి చేసుకోకుండా ఇద్దరూ కలిసే జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి సంబంధాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
వారిని విడదీసేందుకు కుటుంబ సభ్యులు సుమారు నెల రోజుల క్రితం ఇద్దరినీ బెంగళూరుకు తీసుకొచ్చి వేర్వేరు హాస్టళ్లలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. రీటా ఫ్రేజర్ టౌన్లో, సిర్జనా జక్కూర్ ప్రాంతంలో ఉంటున్నట్లు వెల్లడించారు. వేర్వేరు చోట్ల ఉన్నప్పటికీ ఇద్దరూ వారానికి పలుమార్లు కలుసుకునేవారని పోలీసులు తెలిపారు. కలిసి ఉండేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవటం, విడిపోవాల్సి రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఘటనకు దారితీసిన పూర్తి కారణాలను నిర్ధారించేందుకు పోలీసులు వారి కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
యువతుల మృతి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే, ఘటన స్థలిలో యలహంక పోలీసులు ఓ లేఖను గుర్తించారు. అందులో.. తమ ప్రేమను సమాజం అంగీకరించడం లేదని, కలిసి జీవించలేక పోతున్నామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రాసి ఉంది.
