Kanthi Rana Tata
Vijayawada : ప్రేమ వ్యవహారం ఇద్దరు మిత్రుల మధ్య వైరానికి దారి తీసింది. ఈ ఘటనలో ఫుట్ బాల్ క్రీడాకారుడు గిలకా దీపక్ ఆకాష్ (24) హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు బాధ్యులైన ప్రభా @ శ్రీరామ గోపీకృష్ణ, అతనికి సహకరించిన మొత్తం 11 మందిని పోలీసులు వారం రోజుల్లో అరెస్ట్ చేశారు.
విజయవాడలోని కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కలనీలోని ఎఎఫ్-3 అపార్ట్‌మెంట్‌లో గతనెల 31 వ తేదీ దీపక్ ఆకాష్ హత్యకు గురైయ్యాడు. సమాచారం తెలిసిన వెంటనే పటమట పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీపక్ ఆకాష్ గతంలో గుణదలలో నివసించేవాడు. ఓ యువతి విషయంలో ఆకాష్ కు, ప్రభాకు మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో 31-5-22న ఓ బార్‌లో మద్యం సేవించిన తరువాత ఆకాష్, ప్రభాల మధ్య మాటామాటా పెరిగి, గొడవ జరిగింది. ఆ సమయంలో ఎవరికి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనంతరం ఆకాష్ కనకదుర్గా గెజెటెడ్ ఆఫీసర్స్ కాలనీ, రోడ్ నెంబర్-1 లో గల సిటీ టవర్ అపార్ట్మెంట్ కు వచ్చాడు. ఆకాష్ ఆచూకి తెలుసుకున్న ప్రభా గ్యాంగ్ అక్కడకు వచ్చి ఆకాష్ ను కత్తితో పొడిచి చంపి పరారయ్యారు. సమాచారం తెలియగానే పటమట పోలీసు స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నిందితులనుపట్టుకునేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారం రోజుల వ్యవధిలో ఈకేసులో ప్రమేయం ఉన్న 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు విజయవాడ పోలీసు కమీషనర్ కార్యాలయం తెలిపింది. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read : Khammam : నీటి పైపులైన్‌లో ఇరుక్కుని యువకుడి మృతి