29మంది అరెస్టు : పోలీసులను చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు

  • Publish Date - October 29, 2019 / 02:25 PM IST

వారణాశి సమీపంలోని హార్సన్స్ గ్రామంలో  ఘోరం జరిగింది. విధుల్లో ఉన్న పోలీసులను చెట్టుకు కట్టేసి చితకబాదారు గ్రామస్తులు. ఈ దాడిలో ఒక ఎస్సైతో సహా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే…ఒక దోపిడీ కేసులో నిందితులుగా ఉన్ననేరస్తులు రాజన్ భరద్వాజ్, రాహుల్ గ్రామంలో బంధువుల ఇంట్లో భోజనానికి వచ్చినట్టు సమాచారం అందుకున్నారు. అక్టోబరు28, సోమవారం రాత్రి నిందితులను అరెస్టు చేసేందుకు జాన్సాలోని హర్సన్స్ గ్రామానికి రోహనియా పోలీసు స్టేషన్ కు చెందిన క్రైం బ్రాంచ్ ఎస్సై మరి కొంతమంది కానిస్టేబుళ్లను వెంటపెట్టుకుని వెళ్లారు.  

నిందితులను పట్టుకునే క్రమంలో రాహుల్ తప్పించుకుని పారిపోగా రాజన్ భరద్వాజ్ ను అదుపులోకి తీసుకుని కారులో బయలు దేరారు. గ్రామంలో  కొంత దూరం వచ్చేసరికి గ్రామస్తులు కారుకు అడ్డంగా నిలబడ్డారు. బైక్ పై వెళ్తున్న కొందరు పోలీసులను పట్టుకుని గ్రామస్తులు కొట్టారు. కారుపై రాళ్ల వర్షం కురిపించారు. దొరికిన పోలీసులను చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఎస్సై వద్ద ఉన్న సర్వీసు రివాలల్వర్ ను కూడా లాక్కున్నారు.

తప్పించుకు పోయిన పోలీసులు పై అధికారులకు గ్రామస్తుల దాడి విషయమై సమాచారం ఇచ్చారు. దీంతో రూరల్ పోలీసులు అదనపు బలగాలతో గ్రామానికి చేరుకుని గ్రామస్తులను చెదరగొట్టి పోలీసులను విడిపించుకు వెళ్ళారు. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు 29 మందిని అరెస్టు చేశారు. గ్రామంలోరాజన్ భరద్వాజ్, రాహుల్ బంధువుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. గాయపడిన పోలీసులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు వారణాశి ఎస్.ఎస్పీ సురేష్ రావు కులకర్ణి చెప్పారు.