వివేక హత్య సూత్రదారులు చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణ : విజయసాయిరెడ్డి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. టీడీపీపై పలు విమర్శలు చేశారు. పోలీసు వ్యవస్థపై తమకు నమ్మకం లేదని సీబీఐకి అప్పగించాలని వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘తెదేపా 1998లో రాజారెడ్డి హత్యకు ముందు నుంచి వైఎస్ కుటుంబంపై విరుద్ధంగానే ఉంది. రాజారెడ్డి హంతకులను టీడీపీ ఆఫీసులో ఉంచి రక్షణ కల్పించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సత్ప్రవర్తన కింద విడుదల చేశారు. మళ్లీ అధికారంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణంపై అనుమానాలు అలాగే ఉన్నాయి. ఆ కేసును అక్కడే ఆపేశారు. జగన్ ఎయిర్ పోర్ట్ హత్యాయత్నం కేసు అలానే ఉంది’
Read Also: వివేకానందరెడ్డి హత్యను.. పోలీసులు ఎందుకు దాచారు?

‘చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన రెండు రోజులకే వైఎస్ మృతి చెందారు. అప్పటి నుంచీ టీడీపీ వైఎస్ కుటుంబాన్ని నాశనం చేయాలనే చూస్తుంది. రాజారెడ్డి గారి హత్య 1998లో జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజల అభిమానం పొందుతున్నారనే తప్పించారు. జగన్ మీద ఎయిర్ పోర్టులో కూడా అలానే చేశారు. ఇప్పుడు వివేకానంద రెడ్డిని కూడా అదే వ్యూహంతో హత్య చేశారు. వివేకానంద రెడ్డి ఉంటే ఆదినారాయణ రెడ్డి పొలిటికల్ కెరీర్‌కు సమస్య అవుతుందని తొలగించారు. ఆదినారాయణరెడ్డి ఓ హంతకుడు. అలాంటి వాడు మాపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరం. 

‘జగన్ ఎయిర్ పోర్టు ప్రమాదం జరిగిన కాసేపటిలోనే డీజీపీ ఇధి మా పరిధిలో లేదంటూ తోసిపుచ్చారు. అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు.. టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడే కానీ, ప్రమాదంలో ఉన్న రాజకీయ నాయకుని పట్టించుకోలేదు. పత్తికొండలో నారాయణరెడ్డిని హత్య చేశారు. ఆ కేసును తెలుగు దేశం పార్టీ నీరుగార్చింది. పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. అందుకే కేసును సీబీఐ అప్పగించాలని కోరుకుంటున్నాం. సిట్ ఏర్పాటు చేసిన వైఖరి కూడా అనుమానంగానే ఉంది. డీజీపీ మీదే నమ్మకం లేని మాకు ఆయన కింద పనిచేసే సిట్ మీద నమ్మకం ఎలా ఉంటుంది. ఈ కేసును సీబీఐ అప్పగిస్తేనే నిజాలు బయటికొస్తాయి. 
Read Also: చిన్నాన్న‌ను న‌రికి చంపారు – కేసును త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నారు అంటున్న జ‌గ‌న్

‘జగన్ కుటుంబానికి వివేకానంద రెడ్డి కుటుంబానికి మధ్య విభేదాలేమీ లేవు. వైఎస్సార్ పార్టీ జమ్మలమడుగు, కడప నియోజకవర్గాల ఇన్ ఛార్జిగా వివేకానంద రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కష్టపడ్డారు. ఇరు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని టీడీపీ కావాలనే విమర్శలు చేస్తోంది. ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాల సీబీఐ దర్యాప్తు చేయాలని లేఖలు రాస్తాం. మాకు అందిన సమాచారం ప్రకారం.. అంతా గుండెపోటు అని నమ్మాం. పోస్టుమార్టం తర్వాతే మాకు కూడా ఇది హత్యేనని నమ్మకం కలిగింది. అందుకే నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నాం’

‘గతంలోనే డీజీపీని మార్చమని పలు మార్లు ఫిర్యాదు చేశాం. విశ్వాసం లేదని మొరపెట్టుకున్నాం. అయినా మార్పు రాలేదు’ అని మీడియా సమావేశాన్ని ముగించారు.