అక్రమ సంబంధాలో మోజులో రోజు రోజుకూ మానవీయ విలువలు దిగజారిపోతున్నాయి. అక్రమ సంబంధాల్లో సంతోషం కోసం అమానుష ఘటనలకు తెగబడుతున్నారు. ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తని కిరాతకంగా హత్య చేసింది ఒక ఇల్లాలు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో బీరప్ప బస్తీకి చెందిన వెంకటయ్య ,వెంకటమ్మ దంపతులు. కొన్నాళ్ల క్రితం వెంకటమ్మకు మరోక వ్యక్తితో పరిచయం అయ్యింది. ఈవిషయం పసిగట్టిన వెంకటయ్య భార్యను అక్రమ సంబంధం కొనసాగిస్తున్నావని పదే పదే వేధించసాగాడు. వెంకటయ్య వేధింపులు భరించలేని భార్య తన ఇంటివద్ద ఉండే మరొక మహిళ లక్ష్మమ్మతో కలిసి భర్తను హత మార్చేందుకు ప్లాన్ వేసింది.
ఫిబ్రవరి 17 న లక్ష్మమ్మతో కలిసి సినిమాకు వెళ్దామని చెప్పి భర్తను తీసుకుని బయలు దేరింది. మార్గం మధ్యలో లక్ష్మమ్మ వారికి కలిసింది. ముగ్గురు కలిసి సినిమా హాలుకు బయలు దేరారు. ఉన్నట్టుండి వెంకటమ్మ దారిలో ఉండగా సినిమా కంటే ముందు మద్యం సేవిద్దామని చెప్పింది. స్వయంగా భార్యే తాగుదామని ప్రపోజ్ చేసేసరికి వెంకటయ్య ఉత్సాహంగా ఓకే అన్నాడు. ముగ్గురు కలిసి బొల్లారం శివారుకు చేరారు. లక్ష్మమ్మతో కలిసి భర్తకు ఫుల్ గా మద్యం పట్టించింది వెంకటమ్మ.
భర్త అతిగా తాగి స్పృహ కోల్పోగానే పక్కనే ఉన్న బండరాళ్లు తీసుకుని భర్త తలపై, గుండెలపై బాది చంపేసింది. ఆతర్వాత సైలెంట్ గా శవాన్నితీసుకెళ్ళి లాలాబాయి కాలనీ వద్ద పడేసింది. 19 వతేదీ ఏమీ తెలియనట్లు పోలీసుస్టేషన్కు వెళ్లి భర్త కనపడటంలేదని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు వెంకటమ్మను కూడా ప్రశ్నించారు. దీంతో అసలు విషయం బయటపెట్టింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే భర్తను హత్య చేసినట్లు వెంకటమ్మ ఒప్పుకోవటంతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.