youth thrown from moving train
youth thrown from train : పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో దారుణం జరిగింది. నడుస్తున్న రైళ్లో నుంచి ఒక ప్రయాణికుడిని మరో ప్రయాణికుడు బయటకు తోసేశాడు. ఈ ఘటన తారాపీత్ రోడ్-రాంపూర్‌హట్ రైల్వే స్టేషన్ మధ్య చోటు చేసుకుంది. అయితే వీరి వాగ్వాదాన్ని, రైలు నుంచి తోసేసిన ఘటనను తోటి ప్రయాణికులు వీడియో తీస్తూ ఉన్నారే కానీ, ఒక్కరు కూడా వారిని నిలువరించలేకపోవడం శోచనీయం. యువకుడిని తోసేసిన వ్యక్తిని ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శనివారం రాత్రి హౌరా నుంచి మాల్దాకు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి మరొకరిని రైలు నుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని బీర్‌భూమ్‌లోని రాంపూర్‌హాట్ నివాసి సజల్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. రైల్వే ట్రాక్‌పై రక్తం మడుగులో పడివున్న సజల్‌ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని చికిత్స కోసం రాంపూర్‌హట్ ప్రభుత్వ మెడిల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఏదో విషయమై వీరిద్దరూ గొడవ పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరూ లేచి డోర్ వద్దకు వెళ్లారు. కాసేపటికి మరోసారి కొట్లాటకు దారి తీసింది. దాంతో పట్టరాని కోపంతో ఉన్న పెద్దాయన.. యువకుడిని కదులుతున్న రైలు నుంచి బయటకు నెట్టివేశాడు. వీరి ఘర్షణను ఇతర ప్రయాణికులు వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కానీ వారిని నిలువరించడానికి ఎవరూ ప్రయత్నించకపోవడం గమనార్హం.