మహాత్మాగాంధీ ఉపాధి హమీ పథకం (MGNREGA) గుర్తుందా?. గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
మహాత్మాగాంధీ ఉపాధి హమీ పథకం (MGNREGA) గుర్తుందా?. గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి హామీ పథకం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కింద గ్రామీణ ప్రాంత వాసులు వంద రోజులు పనిచేసినందుకు వారికి రోజువారీ వేతనంగా పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ స్కీమ్ అమల్లో ఉండగా.. అర్బన్ ఏరియాల్లో మాత్రం పాన్ -ఇండియా స్కీమ్ అందుబాటులో లేదు. అర్బన్ ఏరియాలో కూడా నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్నవారిని పట్టించుకునే పరిస్థితులు లేవు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు చదువుకుని కూడా ఉద్యోగం లేనివారికి నిరుద్యోగ భృతిని ఆఫర్ చేస్తున్నాయి.
నిరుద్యోగ యువతకు స్థిరమైన ఉపాధి కల్పిస్తేనే :
ఈ తరుణంలో అజిమ్ ప్రేమ్ జీ యూనివర్శిటీ.. నిరుద్యోగంపై కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. నేషనల్ అర్బన్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ ను ప్రవేశపెట్టి నిరుద్యోగులకు చదువుకు తగిన విధంగా స్థిరమైన ఉపాధి కల్పించాలనే ప్రపోజల్ తీసుకొచ్చింది. ఇందుకోసం ‘స్థిరమైన ఉపాధి ద్వారా పట్టణాలను బలోపేతం చేయాలి’అనే శీర్షికతో ఓ పాలసీ పేపర్ ను రిలీజ్ చేసింది. ఎన్నికల వేళ.. యూనివర్శిటీ రీసెర్చర్లు ప్రపోజ్ చేసిన ఈ స్కీమ్ చర్చనీయాంశమైంది. 2019 ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ కొత్త ప్రభుత్వం అర్బన్ జాబ్ గ్యారెంటీ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద పట్టణాల్లోని నిరుద్యోగులు 100 రోజుల ఉపాధి పొందే అవకాశం లభించింది.
12వ తరగతి వరకు చదివినా అర్హులే :
పాన్-ఇండియా స్కీమ్ కింద ఒక మిలియన్ (పది లక్షలు) కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. మొత్తం 4వేల టౌన్లు ఉంటే.. అందులో 126 మిలియన్లు (12.6 కోట్లు) మంది పనిచేసే వారు ఉన్నారు. వీరిలో చాలామంది వేర్వేరు స్థాయిలో పనిచేస్తుండగా.. 12వ తరగతి వరకు చదువుకున్నవారికి 100 రోజుల ఉపాధి హామీ పథకం కింద అర్హత కల్పించవచ్చు. 100 రోజుల ఉపాధి పనిపై రోజుకు రూ.500 వరకు వేతనంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాది శిక్షణకాలంలో తదుపరి 150 రోజుల వరకు కొనసాగే చదువుకున్న యువతకు నెలకు రూ.13వేల వరకు స్టయిఫండ్ ఇవ్వాలని యూనివర్శిటీ పేపర్ పాలసీ సూచిస్తోంది.
చిన్న టౌన్లలో నిరుద్యోగానికి చెక్ :
చిన్న పట్టణాల నుంచి నిరుద్యోగులు పెద్ద పట్టణాలకు వలసలు పోవడం, పట్టణ మౌలిక సదుపాయాలు తక్కువ నైణ్యత, పబ్లిక్ సర్వీసులు, పర్యావరణ క్షీణత, వర్కర్ల కొరత, అర్బన్ లోకల్ బాడీస్ (ULBs) ఆర్ధిక సామర్థ్యాలు లేకపోవడం, నిరుద్యోగం, ఎడ్యుకేటడ్ యూత్ కు సరైన స్కిల్స్ లేకపోవడమే ప్రధాన కారణమని యూనివర్శిటీ పేపర్ పాలసీ అభిప్రాయపడింది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం తరహాలో ఈ పట్టణ ఉపాధి హామీ పథకాన్ని కూడా అమలు చేస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుందని ఈ స్కీమ్ రీసెర్చర్లు తమ ప్రతిపాదనలో ప్రధానంశంగా సూచించారు.
బడ్జెట్ అంచనా :
పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తేస్తే.. ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఈ ఉపాధి హామీ పొందితే అందుకు అయ్యే బడ్జెట్ 1.7 శాతం నుంచి 2.7 శాతం (జీడీపీ) మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. భారత్ లోని చిన్న పట్టణాల్లో 30 నుంచి 50 మిలియన్ల మంది వర్కర్లు ఉన్నట్టు రీసెర్చర్లు అంచనా వేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా వీరందరూ ఉపాధి పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు.