ఏపీలో గ్రూప్-1, 2 దరఖాస్తు గడువు పొడిగింపు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1, 2 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఏపీ పీఎస్సీ పొడిగించింది. గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 7వరకు, గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఫిబ్రవరి 10వరకు పొడిగించారు. యూనిఫామ్ సర్వీస్‌లకు వయోపరిమితి పెంపు రీత్యా దరఖాస్తు గడువు పెంచినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తు గుడువును పొడిగించడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రూప్ 2 కేటగిరీలోని ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు గతంలో 18 నుంచి 28 ఏళ్ల లోపు వారే అర్హులు కాగా తాజాగా రెండేళ్లు పొడిగించారు. ఈమేరకు 18 నుంచి 30 ఏళ్లలోపు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఇక గ్రూప్ 1లోని డీఎస్సీ పోస్టులకు గతంలో 21 నుంచి 28 ఏళ్ల లోపు వారికి మాత్రమే అర్హత ఉండగా దాన్ని 30 ఏళ్లుగా చేశారు.
జైళ్లశాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులకు గతంలో 18 నుంచి 28 ఏళ్ల వయసును పేర్కొనగా ఈసారి 18 నుంచి 30 ఏళ్లుగా చేశారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ పోస్టులకు గతంలో 21 నుంచి 26 ఏళ్ల లోపు వారికి అర్హతని పేర్కొనగా దాన్ని ఇప్పుడు 21 నుంచి 28 ఏళ్లుగా చేశారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులకు గతంలో 18 నుంచి 26 ఏళ్లు ఉండగా ఇప్పుడు 18 నుంచి 28 ఏళ్లుగా మార్చారు.