Board exams: ఏడాదికి రెండుసార్లు బోర్డ్ పరీక్షలు.. అంతేకాదు పాఠ్యాంశాలు అన్నీ..

ఇప్పటివరకు నెలల తరబడి కోచింగ్ తీసుకోవడం, పాఠ్యాంశాలను గుర్తుపెట్టుకోవడం, వాటిని కంఠస్థం చేయడం వంటి అంశాలపైనే విద్యార్థులు ఆధారపడేలా విద్యా విధానం ఉంది.

MoE new curriculum framework

Board exams – Inter: విద్యార్థులకు బోర్డ్ పరీక్షలు ఏడాదికి ఎన్ని సార్లు ఉంటాయి? ఒకే ఒక్కసారి అని ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం. విద్యా విధానంలో అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. త్వరలో ఈ ప్రశ్నకు రెండు సార్లు అని సమాధానం చెప్పే రోజులు రానున్నాయి. విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు బోర్డ్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అంతేకాదు, పరీక్షల విధానంలో ఎన్నో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానం (NEP) ద్వారా ఈ మార్పులు రానున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి తగ్గేలా పాఠ్య ప్రణాళికలనూ రూపొందిస్తున్నామని (New curriculum framework) తాజాగా, కేంద్ర విద్యాశాఖ (Ministry of Education) వర్గాలు తెలిపాయి. అలాగే, విద్యార్థులు అధిక మార్కులు సాధించేలా ఈ విధానం ఉంటుందని వివరించింది.

జాతీయ విద్యా విధానం-2020కి అనుగుణంగా కొత్త పాఠ్యాంశ ప్రణాళిక సిద్ధంగా ఉందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ ప్రకటించారు. 2024 విద్యా సంవత్సరం నుంచి ఆ పాఠ్యపుస్తకాలను తీసుకొస్తామని చెప్పారు.

కీలక మార్పులు ఇవే (NEPలోని అంశాల ఆధారంగా)
* విద్యార్థులు తప్పనిసరిగా రెండు భాషల్లో విద్యను అభ్యసించాలి. అందులో ఒకటి భారతీయ భాషే అయి ఉండాలి. దీనివల్ల భాషా వైవిద్యమే కాకుండా దేశ మహోన్నత సంస్కృతీ వైభవం కూడా విరాజిల్లుతుంది. 11వ తరగతి, 12వ తరగతి విద్యార్థుల పాఠాల్లో ఈ మేరకు మార్పులు జరుగుతాయి.

* విద్యార్థుల అవగాహనా సామర్థ్యాలు, వారి యోగ్యతను స్పష్టం చేసేలా ఈ కొత్త పాఠ్య ప్రణాళిక రూపకల్పన, పరీక్షల విధానం ఉంటుంది. ఇప్పటివరకు నెలల తరబడి కోచింగ్ తీసుకోవడం, పాఠ్యాంశాలను గుర్తుపెట్టుకోవడం, వాటిని కంఠస్థం చేయడం వంటి అంశాలపైనే విద్యార్థులు ఆధారపడేలా విద్యా విధానం ఉంది.

* కొత్త పాఠ్య ప్రణాళికా రూపకల్పన అంతా సబ్జెక్టులపై పూర్తి అవగాహన, ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించేలా విద్యార్థి-కేంద్రీకృత విధానాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు.

* పరీక్షల కోసం చదువుకునేందుకు విద్యార్థులకు కావాల్సినంత సమయం ఉండేలా, పరీక్షల్లో రాణించేలా, అధిక మార్కులు సాధించేలా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు సిద్ధంగా ఉన్నామని, సిలబస్ పూర్తి చేశామన్న ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు ఉంటారు.

* అన్నింటికంటే ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులు ఎంపిక చేసుకునే సబ్జెక్టుల విషయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు విద్యార్థుల సబ్జెక్టుల ఎంపికపై పలు నిబంధనలు ఉండేవి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఇలా ఏదైనా ఓ గ్రూప్ లోని సబ్జెక్టులనే విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ విషయంలో నిబంధనలను తీసేస్తున్నారు.

* విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో వారికి ఎలాంటి సబ్జెక్టులు అవసరమో, గొప్ప విద్యను అభ్యసిస్తున్నామన్న అనుభూతి వారికి కలిగేలా.. అటువంటి పాఠ్య ప్రణాళికను రూపొందిస్తున్నారట.

* కొత్త పాఠ్య ప్రణాళిక రూపకల్పనకు, పరీక్షలకు తగ్గట్లు స్కూల్ బోర్డులు తమ సామర్థ్యాలు పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అందకు తగ్గ వరనులను సమకూర్చుకోవాల్సి ఉందని పేర్కొంది.

BEL Recruitment : భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ఘజియాబాద్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ