తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈమేరకు సుప్రీం కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. వరుసగా 9 ,10, 11,12వ తరగతులు చదివితేనే స్థానికత వర్తిస్తుందని తెలుపుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్ట్ కొట్టిపారేసింది. అలాగే, ఇంటర్మీడియట్ కు ముందు వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానిక రిజర్వేషన్ వర్తిస్తుందన్న తెలంగాణ ప్రభుత్వ జీవో నెంబర్ 33ని సుప్రీం కోర్టు సమర్ధించింది.
ఈ విషయంపై విద్యార్థులు వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే గత ఏడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులు మాత్రం అలాగే కొనసాగించాలని సుప్రీం కోర్టు సూచించింది. కాగా, ఎంబీబీఎస్, బీడీఎస్, యూజీ కోర్సులకు లోకల్ కోటా రిజర్వేషన్ తీర్పు వర్తించనుంది.