విద్యార్థుల అటెండెన్స్ విషయంలో సీబీఎస్‌ఈ కీలక ప్రకటన చేసింది. 2025 – 26 సంవత్సరంలో జరుగబోయే 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు అవడానికి విద్యార్థులకు కనీసం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. లేదంటే పరిక్షలు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అయితే, వైద్య అత్యవసర పరిస్థితులు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనడం, తీవ్రమైన కారణాలకు మాత్రం 25 శాతం వరకు మినహాయింపు ఇవ్వనుంది. కానీ, అత్యవస సందర్భాల్లో తీసుకున్న సెలవుల కోసం విద్యార్థులు తగిన పత్రాలను సమర్పించాలని సూచించింది.
అటెండెన్స్ విషయంలో బోర్డు పాఠశాలలకు చేసిన సూచనలు ఇవే:
- విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు 75 శాతం హాజరు నిబంధన గురించి తెలియజేయాలి. అలాగే పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలని వివరించాలి.
- వైద్య పరమైన లేదా ఇతర అత్యవసర కారణాల వల్ల తీసుకునే సెలవుల కోసం విద్యార్థులు ముందుగానే సరైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి.
- ఎలాంటి అభ్యర్థన లేకుండా తీసుకునే సెలవులు పరిగణంలోకి తీసుకోరు.
- ఇక అత్యవసర వైద్య పరిస్థితుల్లో సెలవు తీసుకున్న విద్యార్థులు వైద్య పత్రాలతో లీవ్ దరఖాస్తును సమర్పించాలి.
- మరే ఇతర కారణాల వల్ల అయినా సెలవు తీసుకుంటే విద్యార్థులు రాతపూర్వకంగా సరైన కారణాన్ని పాఠశాలకు తెలియజేయాలి.
- పాఠశాలలు రోజువారీగా విద్యార్థులు హాజరు వివరాలను పర్యవేక్షించాలి, సరైన రికార్డులను నిర్వహించాలి.
- హాజరు రిజిస్టర్లపై క్లాస్ టీచర్, పాఠశాల అథారిటీ ప్రతిరోజు సంతకం చేయాలి.
- ఒక విద్యార్థి తరచుగా బడికి హాజరు కాకపోతే పాఠశాలలు ఈ విషయాన్ని రాతపూర్వకంగా తల్లిదండ్రులకు తెలియజేయాలి.
- అటెండెన్స్ రికార్డులను తనిఖీ చేయడానికి సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. రికార్డులు అసంపూర్తిగా ఉంటే పాఠశాలపై కఠిన చర్యలు తప్పవు.