CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

CBSE Open Book Exams : విద్యార్థులు నైపుణ్యం సాధించడానికి సీబీఎస్‌ఈ సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విధానంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

CBSE Open Book Exams : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డు పరీక్షలకు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ప్రత్యేకించి 9వ తరగతి నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్‌లను (OBE) ప్రవేశపెట్టాలని సీబీఎస్ఈ ప్రతిపాదించింది. గత ఏడాది పాలకమండలి సమావేశంలో దీనిపై చర్చించిన సీబీఎస్ఈ.. ఇప్పుడు ఆ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అయితే, ఈ విధానం అమలు, సాధ్యాసాధ్యాలపై తల్లిదండ్రులు, నిపుణులలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా విధానం విద్యా రంగంపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనే చర్చలకు దారితీసింది. గత ఏడాదిలో ప్రవేశపెట్టిన కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ సిఫార్సులకు అనుగుణంగా ఈ విధానం ఉండనుంది. ఈ ప్రతిపాదిత పైలట్ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది నుంచే అమలు చేసే దిశగా సీబీఎస్ఈ ప్రయత్నాలు చేస్తోంది.

Read Also : UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ప్రారంభ దశలో ఎంచుకున్న స్కూళ్లు, సబ్జెక్టులలో ఓపెన్ బుక్ ఎగ్జామ్ సాధ్యతను అంచనా వేయడమే సీబీఎస్ఈ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా లోయర్ క్లాసు విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు, హైయర్ క్లాసు విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులను ఎంపిక చేయనుంది. ఈ విధానంతో విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడమే కాకుండా సబ్జెక్టులపై విషయ పరిజ్ఞానం, సృజనాత్మకత, విశ్లేషణాత్మక సామర్థ్యం తెలుసుకోగలరని సీబీఎస్ఈ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. దీని అమలు విధానం ఎంతవరకు సాధ్యమవుతుంది, ఆచరణాత్మక విషయాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి నిర్దిష్ట పాఠ్యపుస్తకాలను కొనుగోలు చేయడం, నోట్ తీసుకోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని భయపడుతున్నారు. చదివింది గుర్తుంచుకుని రాయడం కన్నా పుస్తకాలను చూస్తూ పరీక్షలు రాయడమే చాలా కష్టమని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

పైలట్ ప్రాజెక్ట్ ప్లాన్ ఇదే :
సీబీఎస్ఈ ఎంపిక చేసిన పాఠశాలల్లో 9వ తరగతి నుంచి 10 తరగతులకు సంబంధించిన సబ్జెక్టుల్లో ఇంగ్లీష్, గణితం, సైన్స్, 11 తరగతి నుంచి 12 తరగతులకు ఇంగ్లీష్, గణితం, జీవశాస్త్రం వంటి సబ్జెక్టులను లక్ష్యంగా చేసుకుని ఓపెన్-బుక్ అసెస్‌మెంట్‌ల పైలట్ రన్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ పరీక్షలను పూర్తి చేయడానికి విద్యార్థులు ఎంత సమయం తీసుకుంటారనేది తెలుసుకోవడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది.

ఓపెన్ బుక్ పరీక్షలు అంటే ఏంటి? :
ఓపెన్-బుక్ పరీక్షలు సాధారణ పరీక్షల కన్నా సులభంగా ఉండవు. చూసి రాయడమే కదా.. అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే.. విద్యార్థులు పూర్తిగా కంఠస్థం మీద ఆధారపడరు. విషయ పరిజ్ఞానం, సృజనాత్మకత, విశ్లేషణాత్మక సామర్థ్యం వంటివి ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆలోచనా నైపుణ్యాలు, విశ్లేషణ, సమస్య-పరిష్కార సామర్థ్యాలను అంచనా వేయడంపైనే సీబీఎస్ఈ దృష్టిపెడుతోంది.

మరోమాటలో చెప్పాలంటే.. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేది పుస్తకాలు చూసి పరీక్ష రాయడమే.. తద్వారా విద్యార్థులు అవగాహనపై ఆధారపడకుండా పుస్తకాలు చూస్తూ పరీక్షలు రాసుకోవచ్చు. స్టడీ మెటీరియల్, నోట్ బుక్స్ కూడా ఎగ్జామ్ సెంటర్లకు తీసుకెళ్లొచ్చు. పరీక్ష రాసే సమయంలో డౌట్ అనిపిస్తే పుస్తకాలను చూసి మళ్లీ రాసుకోవచ్చు. ఇలా పరీక్ష రాస్తే ఏంటి ప్రయోజనమంటే.. విద్యార్థి జ్ఞాపకశక్తితో పనిలేదు.. అసలు సబ్జెక్ట్ ఆ విద్యార్థికి ఎంతవరకు అర్థమైంది, ఏ మేరకు పాఠ్యాంశాన్ని విశ్లేషించగలడు, కాన్సెప్ట్‌లను ఎలా అర్థం చేసుకుంటున్నాడు అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

అమలు ఎప్పుడంటే? :
ప్రతిపాదిత పైలట్ ప్రాజెక్ట్ నవంబర్-డిసెంబర్‌లో అమల్లోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతకంటే ముందుగానే ఈ ఓపెన్ బుక్ ఎగ్జామ్ సాధ్యాసాధ్యాలపై అంచనా వేయాలని బోర్డు భావిస్తోంది. విద్యార్థుల్లో ఉన్నత స్థాయి ఆలోచనా నైపుణ్యాలు, సృజనాత్మక సమస్య పరిష్కార సామర్థ్యాలను అంచనా వేయాలని భావిస్తోంది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎంపిక చేసిన సబ్జెక్టులకు మాత్రమే అమలు చేసే అవకాశం ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఓపెన్ బుక్ పరీక్షలకు మార్గదర్శకత్వం వహించిన ఢిల్లీ యూనివర్సిటీ (DU) నుంచి మార్గదర్శకత్వం కోరుతూ జూన్ నాటికి ఈ పైలట్ ప్రాజెక్ట్ రూపకల్పన, ఖరారు చేయాలని సీబీఎస్ఈ యోచిస్తోంది. మరోవైపు.. ప్రత్యేకించి అణగారిన, దృష్టిలోపం ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

సీబీఎస్ఈ గతంలో ఓపెన్ టెక్స్ట్-బేస్డ్ అసెస్‌మెంట్ (OTBA) ఫార్మాట్‌తో అనేక ప్రయోగాలు చేసింది. తొలిసారిగా 2020 ఆగస్టులో ఈ విధానాన్ని అమలు చేసింది. కానీ, ప్రతికూల అభిప్రాయాల కారణంగా అప్పట్లోనే నిలిపివేసింది. పాఠ్యప్రణాళిక కమిటీలోని చర్చల అనంతరం ఈ పరీక్షలకు సమానమైన ప్రమాణాలను నిర్ధారించడానికి ప్రారంభ ఓపెన్ బుక్ పరీక్షల ట్రయల్స్‌లో ఉపాధ్యాయులతో రాయించాలని నిర్ణయించింది. ఏదిఏమైనా.. అన్నింటిని పూర్తిగా విశ్లేషించిన అనంతరం ఈ కొత్త పరీక్షా విధానం మిగతా తరగతులకు విస్తరించాలా? వద్దా? అనేది సీబీఎస్ఈ నిర్ణయం తీసుకోనుంది.

Read Also : UPSC CSE 2024 : సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఐఎఫ్ఎస్ హిమాన్షు త్యాగి గోల్డెన్ టిప్స్.. ఒత్తిడిని ఇలా డీల్ చేయండి! 

ట్రెండింగ్ వార్తలు