మీరు పెన్షన్‌దారులా? కమ్యుటేషన్ ప్రయోజనం పొందగలిగితే మీకో గుడ్ న్యూస్. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసింది. దీనిపై కేంద్ర కార్మిఖ శాఖ పెన్షన్ స్కీమ్ కొత్త మార్పులను నోటిఫై చేసింది. తద్వారా 6.3 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది. ఇది కేవలం కమ్యుటేషన్ ఆప్షన్ ఎంచుకున్న వారికే వర్తించనుంది.
రిటైర్మెంట్ తర్వాత ఎవరైనా ఉద్యోగి ‘కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్’ ఆప్షన్ ఎంచుకుంటే.. పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ఒకేసారి చెల్లిస్తారు. మిగతా మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందజేస్తారు. ఇక్కడ మీకు రావాల్సిన పెన్షన్ మొత్తం తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో పెన్షన్ పూర్తి విలువను 15 ఏళ్ల తర్వాత పునరుద్ధరించడం జరుగుతుంది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్తి పెన్షన్ పొందొచ్చు.
2008 సప్టెంబర్ 26కు ముందు పదవీ విరమణ చేసిన వారికే ఈ కొత్త ప్రయోజనం వర్తించనుంది. రిటైర్మెంట్ సమయంలో కమ్యుటేషన్ ఆప్షన్ ఎంచుకొని ఉంటేనే ఇది వర్తిస్తుంది. దాదాపు 6.3 లక్షల మంది ఈ ఆప్షన్ ఎంచుకున్నవారికి ప్రయోజనం కలుగుతుంది. ఎక్కువ పెన్షన్ వస్తుంది.
పెన్షన్ కమ్యుటేషన్ పునరుద్ధరణ అంశానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గత ఏడాదిలోనే ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్‌వో 2009లో పెన్షన్ కమ్యుటేషన్ ఫెసిలిటీని విత్ డ్రా చేసింది. అంతకంటే ముందు పదవీ విరమణ చేసి కమ్యుటేషన్ ఆప్షన్ ఎంచుకున్న వారు అప్పటి ప్రయోజనాలను కోల్పోవాల్సి వచ్చింది.