ఫస్ట్ టైమ్ : మహిళల నియామకాల కోసం ఆర్మీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్

 మిలటరీ పోలీస్ లో మొట్టమొదటిసారిగా మహిళలను సైనికులుగా నియామకాల కోసం ఇండియన్ ఆర్మీ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది.ఇవాళ(ఏప్రిల్-25,2019) నుంచి ఆన్ లైన్ ప్రాసెస్ మొదలు అయింది. ఆర్మీ చీఫ్ గా బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టినప్పడే ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచన మొదలైంది.ఇటీవల కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుకు తుది ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు మిలటరీలోని పలు విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నా, మిలటరీ పోలీస్ విభాగంలో మాత్రం లేరు. దీంతో వారికి కూడా మిలటరీ పోలీస్ విభాగంలోకి ప్రవేశం కల్పించాలని, మిలటరీ పోలీసు విభాగంలో అంచెలంచెలుగా మహిళల శాతాన్ని20కి పెరిగేలా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఈ ఏడాది జనవరిలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.సాయుధ బలగాల్లో మహిళల శాతాన్ని పెంచడానికి ఈ ప్రయత్నం ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.