ITI: ఐటీఐతో అద్భుత అవకాశాలు.. విదేశీ ఉద్యోగాలు
ఐటీఐ శిక్షణతో కూడా మంచి సంపాదన పొందవచ్చు. విదేశాల్లోనూ రాణించవచ్చు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రభుత్వ ఐటీఐలు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లగా విస్తరిస్తున్నాయి.
ITI jobs
ఐటీఐల్లో పదోతరగతి పాసైన వారికి పలు ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడుల్లో రెండేళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి దాదాపు 50 స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఏపీ నుంచి 519, తెలంగాణ నుంచి 320 ఏటీసీ/ఐటీఐ సెంటర్స్ ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో బాయ్స్, గర్ల్స్, మైనారిటీల కోసం ప్రత్యేకమైన సెంటర్స్ ఉన్నాయి. ఎలాంటి ప్రవేశ పరీక్షా లేకుండానే పదివ తరగతిలో పొందిన గ్రేడ్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. అయితే.. ప్రభుత్వ ఐటీఐల్లో ఈ కోర్సులు ఉచితంగానే చేయవచ్చు కానీ, ప్రైవేటు సంస్థల్లో స్పెషలైజేషన్ ను బట్టి రూ.12,000 నుంచి రూ.17,000 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
స్పెషలైజేషన్స్:
సంవత్సరం కోర్సులు: కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రెస్ మేకింగ్, మెకానిక్, బిల్డింగ్ కన్స్ట్రక్టర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్, సెక్రటేరియల్ ప్రాక్టీస్, ఫౌండ్రీమెన్, సూయింగ్ టెక్నాలజీ, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటేరియల్ అసిస్టెంట్, షీట్ మెటల్ వర్కర్ వంటి ట్రేడులు అందుబాటులో ఉన్నాయి.
రెండేళ్ల కోర్సులు: ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనన్స్, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్/ మెకానికల్), అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్, టర్నర్, వెసెల్ నేవిగేటర్, వైర్‌మెన్ పెయింటర్ జనరల్.
ఉన్నత విద్య అవకాశాలు:
ఐటీఐ తర్వాత ఉన్నత విద్య కోసం డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు. అనంతరం ఈసెట్ ద్వారా నేరుగా రెండో సంవత్సరం బీటెక్/బీఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్లు పూర్తిచేసుకున్నవారు డిగ్రీ, పీజీ చదువుకోవచ్చు.
ఉద్యోగ అవకాశాలు:
రాష్ట్ర స్థాయి ఎలక్ట్రికల్ డిపార్టుమెంటులో జూనియర్ లైన్మెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) రెండేళ్ల కోర్సు పూర్తిచేసుకున్నవారు డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
నౌకాయాన సంస్థలు, స్టీల్ ప్లాంట్లు, పోర్టులు, షిప్పులు, ట్రాన్స్ పోర్ట్ వంటి పరిశ్రమల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు. రైల్వేలో వేల సంఖ్యలో ఉండే అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ పోస్టులకు నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసుకున్నవారు అర్హులు.
ఆర్మీలో సోల్జర్ ట్రేడ్స్‌మెన్ విభాగంలో ఉండే కొన్ని పోస్టులకు ఐటీఐ తప్పనిసరి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తదితర విభాగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, రెఫ్రిజిరేటర్, ఏసీ మెకానిక్‌లకు పట్టణాలు, నగరాల్లో మంచి డిమాండ్ ఉంది.
అంతేకాకండా.. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి సంస్థలు విదేశీ ఉద్యోగాలకు దారి చూపిస్తున్నాయి.
ఐటీఐ శిక్షణతో కూడా మంచి సంపాదన పొందవచ్చు. విదేశాల్లోనూ రాణించవచ్చు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రభుత్వ ఐటీఐలు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లగా విస్తరిస్తున్నాయి.
