విద్యార్ధుల కోసం కొత్తగా 856 ఆధార్ కేంద్రాలు 

  • Publish Date - October 27, 2019 / 06:18 AM IST

తెలంగాణ రాష్ట్రంలో 5-18 సంవత్సరాల లోపు వయసుకల విద్యార్ధుల  కోసం 856 ఆధార్ కేంద్రాలు ప్రత్యేకంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఏడాదిన్నర క్రితం విద్యా శాఖ రాష్ట్రంలో 467 ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆధార్ నమోదు కిట్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్  ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు  అందచేశారు.

మండలాల్లో ఎంఈఓల పర్యవేక్షణలో పనిచేసే ఎంఐఎస్ సమన్వయ కర్తలకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. తాజాగా మంజూరైన కేంద్రాలకు మాత్రం  ప్రత్యేకంగా యువకులను ఎంపిక చేస్తున్నారు. మరో నెలరోజుల్లో 876  కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని పాఠశాల విద్యా కమీషనర్  విజయకుమార్ తెలిపారు.

వీటి ద్వారా ప్రభుత్వ అధికారులే పాఠశాలలకు వెళ్లి ఆధార్ సేవలు అందిస్తారు. ఇంతకు ముందే ఆధార్ నమోదు చేయించుకుని వాటిలో ఏమైనా తప్పోప్పులు ఉన్నా సరిచేస్తారు. 14, 16 ఏళ్లు దాటిన తర్వాత వేలిముద్రల్లో మార్పులు వస్తున్నందున వారి నుంచి కూడా కొత్తగా వేలిముద్రలు తీసుకుంటారు.