ఫీజులు వసూలు చేయొద్దు.. అన్ని ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు 

  • Publish Date - April 4, 2020 / 04:39 AM IST

దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. కరోనా కొత్త కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయరాదంటూ హర్యాణా ప్రభుత్వం అన్ని ప్రైవేటు స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. 

 లాక్ డౌన్ పరిమితి కాలం ముగిసేంతవరకు ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులను ఫీజుల కోసం ఇబ్బంది పెట్టరాదని సూచించింది. హర్యాణా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ అధికారిక ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. తమ డిపార్ట్ మెంట్.. ఇప్పటికే అన్ని జిల్లా విద్యాధికారులు, జిల్లా ప్రైమరీ ఎడ్యుకేషన్ అధికారులకు సూచనలు చేసిందని చెప్పారు.

తమ ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై అవగాహన కల్పించేలా చూడాలని సూచించినట్టు తెలిపారు. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి.

కరోనాను నియంత్రించేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. భౌతిక దూరాన్ని పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత కేంద్రం ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుందో వేచి చూడాలి. 

Also Read | తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా.. ఏపీలో 164, తెలంగాణలో 229 కేసులు, ఢిల్లీ నుంచి వచ్చిన ఆ 105మంది ఎక్కడ