CBSE guidelines: సీబీఎస్‌ఈ పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులకు ముఖ్యమైన మార్గదర్శకాలు.. పాటించకుంటే చిక్కులు..

పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

దేశంలో సీబీఎస్‌ఈ పదో తరగతి, 12వ తరగతి ఎగ్జామ్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం 42 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. టెన్త్ క్లాస్‌ పరీక్షలు మార్చి 18 వరకు జరగనుండగా, 12వ తరగతికి పరీక్షలు ఏప్రిల్‌ 4 వరకు జరుగుతాయి.

దేశంలో మొత్తం 7,842 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. భారత్‌తో పాటు మరో 26 దేశాలలో పరీక్షల నిర్వహణ ఉంటుంది. 10వ తరగతి విద్యార్థులు ఇవాళ ఇంగ్లీష్ పరీక్ష రాశారు. అలాగే, 12వ తరగతి విద్యార్థులు ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఎగ్జామ్ రాశారు.

తెలంగాణ నుంచి ఈ పరీక్షలకు పదో తరగతి విద్యార్థులు దాదాపు 50 వేల మంది హాజరవుతుండగా, 12వ తరగతి విద్యార్థులు సుమారు 10 వేల మంది రాయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌ స్టూడెంట్స్‌ సుమారు 40 వేల మంది, 12వ తరగతి విద్యార్థులు 12,000 మంది ఉన్నారు.

Also Read: జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? ప్లాన్‌లు ఎలా ఉన్నాయంటే? ఫ్రీగానూ చూడొచ్చు.. పూర్తి వివరాలు

నిబంధనలు ఇవే.. 
బోర్డు ప్ర‌క‌టించిన స‌మ‌యానికి అర‌గంట ముందే విద్యార్థులు ప‌రీక్ష కేంద్రానికి రావాలని నిబంధనలు పెట్టారు. సమయం దాటి వచ్చిన వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమ‌తించ‌రు. పరీక్షా స‌మ‌యం ముగిశాకే విద్యార్థులను బ‌య‌ట‌కు పంపుతారు.

పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లతో పాటు బ్లూ టూత్ డివైజ్‌లు, మైక్రోఫోన్లు, స్మార్ట్​ వాచ్​ల వంటి వాటిని తీసుకెళ్లకూడదు. హాల్‌టికెట్ల‌తో పాటు స్కూల్‌ లేదా కాలేజీ గుర్తింపు కార్డులను విద్యార్థులు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

మాల్‌ప్రాక్టీస్‌కు పాల్ప‌డితే అధికారులు ఉపేక్షించబోరు. పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో 24 మంది విద్యార్థుల చొప్పున కూర్చుంటారు. ఒక్కో గదిలో ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటారు. అంతేగాక, సీసీటీవీ ఫుటేజీలను అసిస్టెంట్ సూపరింటెండెంట్లు పరిశీలిస్తూనే ఉంటారు.

విద్యార్థుల సమాధాన పత్రానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీంతో విద్యార్థుల పేపర్ ట్రాకింగ్ తేలికకానుంది. పరీక్షల సమయంలో చీటింగ్‌ చేయకుండా ఉపయోగపడుతుంది. ప్రశ్నాపత్రంపై విద్యార్థులు మార్కింగ్ చేయడం వంటివి చేయొద్దు. అలాగే, ఎలాంటి నంబర్లు కూడా రాయకూడదు.