మీ పిల్లలను 4 ఏళ్లకే స్కూళ్లకు పంపుతున్నారా?

  • Publish Date - January 15, 2020 / 10:57 AM IST

భారతదేశంలో చాలామంది చిన్నారులను 4 ఏళ్లలోపే పాఠశాలకు పంపిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో 4 ఏళ్లు రాగానే పిల్లలను ప్లే స్కూల్ పంపుతున్నారు. ఆ తర్వాత నర్సరీ, LKG, UKG అంటూ స్కూళ్లకు పంపిస్తున్నారు. ఎందుకంటే  పిల్లాడికి స్కూల్ అలవాటు కావాలనో లేదా ముందునుంచే స్కూల్లో వేస్తే.. 5 ఏళ్ల వయస్సు వచ్చేసరికి నేరుగా ఫస్ట్ క్లాసులో వేయొచ్చులే అని ఇలా ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలను అతి తొందరగా పాఠశాలలకు పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

వాస్తవానికి విద్యా హక్కు (RTE) చట్టం 2009 ప్రకారం.. ఒక పిల్లాడు 6 ఏళ్ల వయస్సు కంటే ముందుగానే 1వ తరగతిలోకి ప్రవేశించాలని ఆదేశించింది. కానీ, భారతీయ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను 4 ఏళ్ల వయస్సులోనే ఫస్ట్ క్లాసులో చేర్పిస్తున్నారు. నెమ్మదిగా అతడే అలవాటు అవుతాడులే అని పంపిస్తున్నామని అంటున్నారు. ఈ పద్ధతి.. ప్రస్తుతం నగరాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా నడుస్తోంది. 

వార్షిక విద్యా స్థితిగతుల నివేదిక  (ASER) 2019 ప్రకారం.. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలలో ఐదవ వంతు కంటే ఎక్కువ మంది 1వ తరగతి చదువుతున్నారు. అతి తక్కువ వయస్సులోనే ఫస్ట్ క్లాసులో చేరడం ద్వారా వారి కంటే పెద్ద పిల్లలే గణనీయంగా మెరుగ్గా చదువుల్లో రాణిస్తున్నారని నివేదిక సూచిస్తోంది. అంటే.. అక్షరాలతో పాటు సంఖ్యలను గుర్తించగలడం.. అలాగే చదవగల సామర్థ్యం ఎక్కువగా పెద్ద పిల్లల్లోనే ఉంటుందని తెలిపింది. ‘పిల్లలను చాలా చిన్న వయస్సులోనే అధికారిక పాఠశాలల్లో చేర్పించడం కారణంగా వారి స్కూల్ లైఫ్.. విద్యాపరంగా ఇతరుల వెనుక ఉండటానికి ఒక ముఖ్యమైన కారణం’ అని నివేదిక పేర్కొంది. 

UKలో 5 ఏళ్లు.. USలో 6 ఏళ్లు : 
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. యూకేలోని పిల్లలకు కనీసం 5 సంవత్సరాల వయస్సు లోపు ఉండాలి. అదే యూఎస్ లో అయితే 6 సంవత్సరాల వయస్సులోపు ఉంటే తప్పా అధికారిక పాఠశాల విద్యను ప్రారంభించరు. వాస్తవానికి కిండర్ గార్టెన్‌లో  పిల్లల చదువు ప్రారంభం కావాలాన్నా, ఒక పిల్లవాడు కిండర్ గార్టెన్‌లో చేరేముందు UK లేదా USలో వరుసగా 5 లేదా 6 సంవత్సరాల వయస్సు తప్పనిసరిగా ఉండి తీరాలి.  స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం.. 5 లేదా 6 ఏళ్ల వయస్సులో పిల్లలను పాఠశాలలో చేర్చుకోవడం ద్వారా వారి విద్యా విజయాలను మెరుగుపర్చడమే కాదు.. నేరాలకు పాల్పడే వారి ప్రవృత్తిని కూడా తగ్గిస్తుందని గుర్తించారు. 

పిల్లల పాఠశాల ప్రారంభ వయస్సు ఒక వ్యక్తి దీర్ఘకాలిక ఆదాయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపదని వెల్లడించింది. ASER చట్టం కూడా ప్రస్తుత వయస్సు ప్రమాణాల ప్రతికూలతలను సూచిస్తోంది. ప్రస్తుతం ఫస్ట్ క్లాసు చదువుతున్న 41.1 శాతం మంది పిల్లలు 1 నుంచి 9 అంకెల వరకు గుర్తించగలరు.

NCERT ప్రకారం.. 1వ తరగతిలోని పిల్లలు 99 వరకు సంఖ్యలను గుర్తించగలగాలి. ఇప్పుడు అది కేవలం సంఖ్యల ఆట కాదనే విషయం ప్రతి పేరంట్స్ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అతి తక్కువ వయస్సులోనే పిల్లలను స్కూళ్లకు పంపింతే మారి మానసిక స్థితిపై కూడా ప్రభావం పడే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.