డీడీ సహ్యాద్రిలో స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక పాఠాలు, జూలై 20 నుంచి ప్రారంభం

  • Publish Date - July 9, 2020 / 11:07 AM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా మార్చి 14న విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమైపోయింది. ఇప్పట్లో స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు తెరవకపోయినా టైమ్ కి సిలబస్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం డీడీ సహ్యాద్రి చానెల్ లో స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఎడ్యుకేషనల్ ప్రొగ్రామ్ రూపకల్పన చేసింది. జూలై 20 నుంచి సహ్యాద్రి చానెల్ లో టెలివైజ్డ్ లెక్చర్స్ ప్రసారం చేయనుంది. టిలిమిలి(TiliMili) పేరుతో దీన్ని ప్రసారం చేయనుంది. ఇది 30 నిమిషాల నిడివితో ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 7.30 గంటలకు ప్రసారం చేస్తారు.

1 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం:
పుణెకి చెందిన ఎంకేసీఎల్ నాల్డెజ్ ఫౌండేషన్(Maharashtra Knowledge Corporation Ltd) 1 నుంచి 8వ తరగతి మరాఠీ మీడియం విద్యార్థుల కోసం ఈ వీడియోలు రూపొందించింది. ముందుగా ఉదయం 7.30కి 8వ తరగతి విద్యార్థులకు క్లాస్ స్టార్ట్ అవుతుంది. అరగంట తర్వాత ఏడవ తరగతి వారి కోసం లెక్చర్ స్టార్ట్ అవుతుంది. అలా మధ్యాహ్నం 12.30 వరకు వివిధ క్లాసులకు చెందిన పాఠాలు ప్రసారం అవుతాయి.

జూలై 20 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు:
జూలై 20 నుంచి ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. 10 వారాల పాటు అంటే సెప్టెంబర్ 26వ తేదీ వరకు ప్రసారం చేస్తారు. ఒక్కో తరగతికి ప్రస్తుతానికి 480 ఎపిసోడ్లు లేదా 60 లెక్చర్లు సిద్ధం చేశారు. బాలభారతి టెక్స్ట్ బుక్స్ ఆధారంగా లెక్చర్లు రూపొందించారు. ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ కంప్లీట్ అయ్యేలా ఈ ఎపిసోడ్లు రూపొందించారు. టిలిమిలి సిరీస్ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మహారాష్ట్ర నాల్డెడ్జ్ కార్పొరేషన్ లిమిటెడ్(MKCL) చీఫ్ మెంటర్ వివేక్ తెలిపారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా వీటిని చూడొచ్చన్నారు.

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం:
దేశంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్రలో టాప్ లో ఉంది. మహారాష్ట్రలో మంగళవారం(జూలై 7,2020) 5వేల 134 కేసులు నిర్ధారణ కాగా.. బుధవారం(జూలై 8,2020) మళ్లీ కొత్త కేసులు పెరిగాయి. కొత్తగా 6వేల 603 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 2లక్షల 23వేల 724కి చేరింది. బుధవారం 198 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా మరణాలు 9వేల 448కి చేరాయి. ఇక, మే 12 తర్వాత ముంబైలో మంగళవారం తొలిసారి పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదయ్యింది. కానీ, బుధవారం మాత్రం ఇది రెట్టింపైంది. ముంబైలో 1374 కేసులు, పుణెలో 1049 కేసులు నమోదయ్యాయి.