Microsoft layoffs
మైక్రోసాఫ్ట్ తన సిబ్బందికి షాక్ ఇవ్వబోతుంది. ఈ సంస్థ మరోసారి భారీగా ఉద్యోగాల తగ్గింపులకు సిద్ధమవుతోంది. దానికి కారణం ఇటీవల ఈ కంపెనీ కృత్రిమ మేధస్సు(AI) పై గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. ఈ నేపథ్యంలోనే సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించింది. ఈ రౌండ్ లే ఆఫ్ లో ప్రధానంగా సేల్స్ విభాగాన్ని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సమాచారం మేరకు జులై నెలలో ఈ లే ఆప్స్ ఉందనున్నట్టు తెలుస్తోంది.
ఈ దఫా లే ఆఫ్ తో సేల్స్ టీమ్స్ పై ప్రభావం పడనుంది. కానీ, ఇతర విభాగాలలో కూడా ఈ కోతలు ఉంటాయని తెలుస్తోంది. పరిశ్రమల పోటీని తట్టుకోవడానికి, ఉత్పత్తులు మరియు సేవలలో కృత్రిమ మేధ(AI) సేవలను ఎక్కువగా వినియోగించాలని నిర్ణయించింది. అందుకే మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుబడులపై దృష్టి సారించింది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 80 బిలియన్ డాలర్ల మూలధన వ్యయాన్ని ప్లాన్ చేసింది మైక్రోసాఫ్ట్. వీటిలో సగానికిపైగా కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి డేటా సెంటర్లను నిర్మించడానికి ఖర్చు చేయనున్నారు.
ఈ సంవత్సరం మైక్రోసాఫ్ట్ చేపట్టిన లేఆఫ్ లు ఎక్కువగా ఉత్పత్తి మరియు ఇంజనీరింగ్ విభాగాల్లోనే జరిగాయి. ఇప్పటికే సుమారు 6,000 ఉద్యోగాలను తొలగించింది సంస్థ. ఇక ఇప్పుడు సేల్స్, మార్కెటింగ్ లాంటి కస్టమర్ – ఫేసింగ్ విభాగాలపై దృష్టి పెట్టింది. 2023 నుంచి ఇప్పటివరకు దాదాపు 10,000 ఉద్యోగాలను తొలగించింది మైక్రోసాఫ్ట్.
చిన్న, మధ్య తరహా వినియోగదారులకు సాఫ్ట్వేర్ అమ్మకాలు జరపడం కోసం థర్డ్ పార్టీ సంస్థల సహాయం తీసుకోనున్నట్లు ఇప్పటికే ఉద్యోగులకు తెలియజేసింది మైక్రోసాఫ్ట్. డేటాసెంటర్ల, సర్వర్ల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుండటంతో మిగతా విభాగాల్లో ఖర్చుకు అడ్డుకట్ట వేస్తామని సంస్థ ప్రకటించింది. ఇక జూన్ 2024 నాటికి 45,000 మంది సేల్స్ మార్కెటింగ్ ఉద్యోగులు ఉన్నారు. మరి ఈ లేఆఫ్ లో ఎంతమందిని బయటకు పంపించనున్నారో చూడాలి.