నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలని 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఇవాళ జస్టిస్ అరుణ్ మిశ్రా, బీఆర్ గవాయి, కృష్ణమురారీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విద్యార్థుల పిటిషన్ తరపు న్యాయవాది అలోక్ శ్రీవాత్సవ్ వాదించారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షల తరహాలోనే నీట్, జేఈఈలను కూడా వాయిదా వేయాలని కోరారు. తామేమీ నిరవధిక వాయిదా కోరడం లేదన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పరీక్షల నిర్వహణ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. దీర్ఘకాలం పాటు విద్యార్థుల కెరీర్‌ను ఆందోళనకు గురిచేయలేమని పేర్కొన్నది.
పరీక్షలను వాయిదా వేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఏడాదిపాటు అకడమిక్ ఇయర్‌ను విద్యార్థులు కోల్పోతారని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించింది. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందే. కోవిడ్ మరో ఏడాది కొనసాగే అవకాశాలు ఉన్నాయి, మరి మీరు మరో సంవత్సరం ఇలాగే ఎదురుచూస్తారా అని జస్టిస్ అరుణ్ మిశ్రా .. పిటిషన్ వేసిన విద్యార్థుల్ని ప్రశ్నించారు. ఇప్పుడు వైరస్ భయాలతో పరీక్షలు వాయిదా వేస్తే వచ్చే ఏడాది కూడా అలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చు. అప్పుడు కూడా వాయిదా వేస్తారా? అని ధర్మాసనం వ్యాఖ్యానించింది
ముందుగా నిర్ణయించిన సెప్టెంబర్ నెలలో జేఈఈ, నీట్ పరీక్షలు జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్‌ను దేశవ్యాప్తంగా ఉన్న 161 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిన విషయం తెలిసిందే.