NEET PG 2025 entrance exam to be held across the country tomorrow
వైద్య విద్యార్థులు ఎదురుచూస్తున్న నీట్ పీజీ 2025 పరీక్ష (NEET PG Exam) ఆగస్టు 3న అంటే రేపు జరుగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం జరుగనున్న ఈ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) పూర్తిచేసింది. ఆగస్టు 3 ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష జరుగనుంది.
ఈ పరీక్షకు 4 రోజుల ముందు అభ్యర్థులకు తమ తమ అడ్మిట్ కార్డులను విడుదల చేశారు అధికారులు. ఇక ఈ పరీక్ష ద్వారా డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MD), మాస్టర్ ఆఫ్ సర్జరీ (MS), పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ ఎంబీబీఎస్ డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DNB), డాక్టరేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (DrNB) వంటి డిప్లామా కోర్సుల్లో ప్రవేశాలు పొందనున్నారు అభ్యర్థులు.
ఇక పరీక్ష రోజు అభ్యర్థులను కేవలం 45 నిమిషాల ముందు మాత్రమే సెంటర్లలోకి అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికిపైగా నీట్ పీజీ రాయనున్నారు. అందులో తెలంగాణ నుంచే సుమారు 10 వేల మంది విద్యార్థులకు ఎగ్జామ్ రాస్తుండటం విశేషం. వీరికోసం హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఈ పరీక్షకు సంబందించిన ఫలితాలు సెప్టెంబర్ 3 విడుదల కానున్నాయి.