NEET PG 2025: ఒకే షిఫ్టులో నీట్ పరీక్ష.. అనుమతించిన సుప్రీం కోర్ట్.. ఆగస్టు 3న ఎగ్జామ్

నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు రెండు నెలలకు పైగా సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది ఎన్బీఈఎంఎస్.

Neet pg 2025 exam

నీట్-పీజీ 2025 పరీక్షను ఒకే షిఫ్ట్ లో నిర్వహించడానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS)కు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించింది. ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలన్న ఎన్బీఈఎంఎస్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు గతంలోనే తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈమేరకు జూన్ 15న జరగాల్సిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ను ఒకే షిఫ్టులో నిర్వహించాలని ఆదేశించింది.

అయితే తాజాగా జరిగిన వాదనల్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహణకు రెండు నెలలకు పైగా సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది ఎన్బీఈఎంఎస్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒకేసారి పరీక్ష నిర్వహించడానికి సుమారు 1,000 పరీక్షా కేంద్రాలు అవసరమని ఎన్బీఈఎంఎస్ తెలిపింది. కాస్త కష్టమే అయినప్పటికి జూన్ 15న జరగాల్సిన పరీక్షను తమ టెక్నాలజీ భాగస్వామి అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఆగస్టు 3న ఒకే షిఫ్ట్ లో నిర్వహిస్తామని ఎన్బీఈఎంఎస్ స్పష్టం చేసింది. అయితే ఎన్బీఈఎంఎస్ అభ్యర్థనను మొదట ప్రశ్నించిన ధర్మాసనం, ఆ తరువాత అంగీకరించింది. కారణాలు సరైనవిగా కనిపిస్తున్నాయని పేర్కొంది. నీట్-పీజీ 2025 పరీక్షను ఆగస్టు 3న నిర్వహించడానికి అంగీకరించింది.