ఉదయం నుండి రాత్రి వరకు ఫోన్లు స్విచాఫ్ చేయండి..పిల్లలతో ఆ సమయంలో ఆనందంగా గడపండి..అంటూ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా తమిళనాడు విద్యాశాఖ ఈ మేరకు అన్ని పాఠశాలలకు సర్క్యూలర్ జారీ చేసింది. పిల్లలతో ఆనందంగా..ఆహ్లాదంగా గడిపేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
బాలల దినోత్సవం పురస్కరించుకుని పేరెంట్ టీచర్స్ అసోసియేసన్ తరపున ఆ రోజు సెల్ లేకుండా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకు పేరెంట్స్ ఫోన్లు ముట్టుకోవద్దని..వాటిని స్విచ్చాఫ్ చేయాలని కోరింది. పిల్లలతో గడపాలని, దీనిని వారానికి ఒకసారి లేదా..రోజు కూడా అమల్లోకి తీసుకరావచ్చని వెల్లడించింది. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియచేయాలని, పిల్లలు, ఉపాధ్యాయులు దీనిని ఆచరణలో పెట్టాలని సూచించింది.
స్కూల్ నుంచి రాగానే బండెడు హోం వర్క్ ఉన్నా..బ్యాగును ఓ మూలన పడేసి..వెంటనే సెల్ ఫోన్ పట్టుకుని అందులో లీనమై పోతున్నారు. చివరికి భోజనం చేసే సమయంలోనూ..సెల్ ఫోన్ చేతిలో లేనిదే..ముద్ద దిగని పరిస్థితి నెలకొంటోంది. బడిలో ఉన్న కాసేపు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇంటికొచ్చింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు సెల్ ఫోన్ చేతిలో పట్టుకోవడం లేక..టీవీల్లో బొమ్మలు చూస్తూనే కాలం గడుపుతున్నారు. తల్లిదండ్రులు కూడా అదే విధంగా వ్యవహరిస్తుండడంతో అక్కడి విద్యాశాఖ పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.