ఇంటర్ ఫలితాలపై హైకోర్టు విచారణ : గ్లోబరీనా సంస్థకు నోటీసులు

  • Publish Date - May 15, 2019 / 08:52 AM IST

ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫలితాల్లో నెలకొన్న పరిస్థితులపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై మే 15వ తేదీ బుధవారం విచారణ జరిపింది కోర్టు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ ఫలితాలు మే 27వ తేదీన  ప్రకటించాలని ఇంటర్ బోర్డుకి హైకోర్టు ఆదేశించింది. ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల రీ వేరిఫికేషన్, రీ కౌంటింగ్ పూర్తి చేశామని ఇంటర్ బోర్డు కోర్టుకు తెలిపింది.

మే 16వ తేదీన ఫలితాలను ప్రకటిస్తామంది. సమాధాన పత్రాలను మే 27వ తేదీన నెట్‌లో ఉంచుతామంది. ఫలితాలు, సమాధాన పత్రాలను ఒకేసారి ప్రకటించాలని ఇంటర్ బోర్డుకు కోర్టు సూచించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. 

ఇటీవలే వెల్లడయిన ఫలితాలు తీవ్ర గందరగోళానికి దారి తీశాయి. మెరిట్ స్టూడెంట్స్ ఫెయిల్ కావడం..కొన్ని సబ్జెక్టుల్లో సున్నా మార్కులు రావడం..పరీక్షకు హాజరైనా..హాజరు కాలేదని..ఫెయిల్ అయినట్లు మెమెలో పేర్కొన్నారు. తీవ్రమనస్థాపానికి గురైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు  భారీస్థాయిలో ఆందోళన చేపట్టాయి. చివరకు సీఎం కేసీఆర్ రంగ ప్రవేశం చేసి పలు ఆదేశాలు, సూచనలు చేశారు. అయితే..కొంతమంది కోర్టు మెట్లు ఎక్కడంతో కోర్టు విచారణ జరుపుతోంది.